"తల్లిని చంపి, ఉడికించి తినాలనుకున్నాడు... ఉరిశిక్ష సరైందే"!
నవమాసాలు మోసి, కని పెంచిన కన్న తల్లి విషయంలో ఓ దారుణానికి పాల్పడ్డారు కొడుకు.
By: Tupaki Desk | 2 Oct 2024 3:45 AM GMTనవమాసాలు మోసి, కని పెంచిన కన్న తల్లి విషయంలో ఓ దారుణానికి పాల్పడ్డారు కొడుకు. ఆమెను చంపి, ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి, వాటిని వండుకుని తినేందుకు ప్రయత్నించాడు! ఈ అత్యంత ఘోరమైన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ కేసులో బాంబే హైకోర్టు తీర్పు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... కన్నతల్లిని చంపి, ఆమె శరీర భాగాలను ఉడికించి తినేందుకు సిద్ధమైన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఈ దోషికి మరణశిక్షే సబబని పేర్కొంది. ఇలాంటి నేరాలు అత్యంత అసాధారణమైనవని.. ఇందులో శిక్ష తగ్గించేందుకు ఆస్కారమే లేదని స్పష్టం చేసింది!
వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని కొల్ హాపుర్ కు చెందిన సునీల్ రమా కుచ్ కొరవి (38) అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆగస్టు 28, 2017న మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
నాడు ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు... సునీల్ రమా కుచ్ కొరవి కి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు 2021లో వచ్చింది. అయితే... సునీల్ దీన్ని హైకోర్టులో సవాల్ చేశాడు! అయితే తాజాగా హైకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా... సొంత తల్లిని చంపి, ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి, కొన్ని భాగాలను ఉడికించి తినేందుకు సిద్ధమయ్యాడు.. ఇది నరమాంసం తినడం కిందికే వస్తుంది.. ఇది అత్యంత అసాధారణ నేరం అని ధర్మాసనం తెలిపింది. ఇంతకంటే భయంకరమైన చర్యను గతంలో ఎన్నడూ చూడలేదని అభిప్రాయపడింది. శిక్షలో మార్పులేదని స్పష్టం చేసింది!