Begin typing your search above and press return to search.

శాంతి వర్సెస్ మదన్ వర్సెస్ గవర్నమెంట్ సస్పెన్షన్ చార్జెస్ !

దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్ గా పనిచేసి సస్పెండ్ కి గురి అయిన శాంతి వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశం అవుతోంది

By:  Tupaki Desk   |   27 July 2024 5:04 AM GMT
శాంతి వర్సెస్ మదన్ వర్సెస్ గవర్నమెంట్ సస్పెన్షన్ చార్జెస్ !
X

దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్ గా పనిచేసి సస్పెండ్ కి గురి అయిన శాంతి వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశం అవుతోంది. ఆమె విషయంలో తీసుకుంటే దేవాదాయ శాఖ మెమో ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే విడాకులు తీసుకోకుండానే మరో పెళ్ళి అంటూ పేర్కొంది.

ఇక చూస్తే కె శాంతి 2020లో సర్వీసులో చేరినపుడు సర్వీస్ రికార్డులలో మదన్ మోహన్ ని భర్తగా వెల్లడించారు అని పేర్కొంది. అలాగే 2023 జనవరి 5న మెడికల్ లీవ్ పెట్టినపుడు కూడా భర్త పేరు అదే రాశారు అని గుర్తు చేసింది. కానీ 2024 జూలై 17న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త పేరు పి సుభాష్ అని చెప్పారని మెమోలో పేర్కొన్నారు. అదే సమయంలో సివిల్ కోర్టు ద్వారా భర్త నుంచి విడాకులు తీసుకోలేదని కూడా శాంతి అంగీకరించారని కూడా పేర్కొన్నారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగి విడాకులు తీసుకోకుండా రెండవ పెళ్ళి చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ 1964 రూల్ 25కి విరుద్ధమని ఆ మెమోలో పేర్కొన్నారు. అలాగే ఈ విషయాలను అన్నీ పేర్కొంటూ శాంతి తన ప్రవర్తన ద్వారా చర్యల ద్వారా భక్తులు ప్రజల దృష్టిలో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారని మేమోలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇక దేవాదాయ శాఖ జారీ చేసిన క్రమ శిక్షణా చర్యల మీద ఆమె ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే ప్రెస్ మీట్ పెట్టారని కూడా మెమోలో పేర్కొన్నారు. ఇది రూల్స్ 16కి పూర్గ్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఇక గత ఏడాది మే 28న ఎక్స్ వేదికగా చేసుకుని ఎపుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సర్, మీరు పార్టీకి వెన్నెముక అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ట్వీట్ చేస్తూ పోస్ట్ చేశారని కూడా మెమోలో పేర్కొన్నారు. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీతో ఆమెకు ఉన్న సంబంధాన్ని సూచిస్తోందని ఇది రూల్ నంబర్ 19 (1) ప్రకారం వ్యతిరేకమైన చర్యగా తెలిపారు.

అలాగే 2022 ఆగస్ట్ 8న ప్రజలతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల మీద విశాఖ అరిలోవ పోలీస్ స్టేషన్ లో శాంతి మీద కేసు ఫైల్ అయినట్లుగా మెమోలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా సరే ఆమె దానిని ఉన్నతాధికారుల దృష్టిలోకి తీసుకుని రాలేదని మెమోలో మరో అభియోగంగా చూపించారు.

ఇక శాంతి విశాఖపట్నంలో పనిచేస్తున్నపుడు తన అధికార పరిధిలోకి లేకపోయినా అనకాపల్లి, చోడవరం, లంకెలపాలెం, పాయకరావుపేట, ధారపాలెంలోని ఆలయాలకు చెందిన భూములు దుకాణాల లీజులను మూడేళ్ళ నుంచి 11 ఏళ్ల పాటు రెన్యూవల్ చేసేలా కమిషనర్ కి ఒక ప్రతిపాదన పంపించి రెన్యూవల్ చేయించారు అని కీలక అభియోగాన్ని శాంతి మీద మోపుతూ మెమోలో పేర్కొన్నారు.

ఇలా ఆరు అత్యంత ప్రధానమైన అభియోగాలను శాంతి మీద మోపుతూ ఆమె వాటికి పదిహేను రోజుల లోపల తన వివరణ ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశించడం విశేషం. దీంతో దేవాదాయ శాఖలో పనిచేసిన అధికారిణి కె శాంతి వీటి మీద ఏ రకమైన వివరణ ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన నేపధ్యం ఉంది. మరి సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఆమె ఈ విధంగా చేశారు అని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఇంకో వైపు ఆమె వైవాహిక జీవితానికి సంబంధించి భర్త మదన్ మోహన్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అధికారి విషయంలో అందునా మహిళా అధికారిణి విషయంలో సాగుతున్న ఈ చర్చ ఆమె మీద మోపబడిన అభియోగాలు చూస్తూంటే ఇది ఏ వైపు మలుపు తిరుగుతుందని కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు.