Begin typing your search above and press return to search.

బాబు అప్పులు... జగన్ అప్పులు... లెక్క తేల్చేశారుగా...!

ఈ నేపధ్యంలో ఏపీ లో ఎన్ని అప్పులు ఉన్నాయి అన్న దాని మీద కేంద్రం క్లారిటీగా లెక్క చెప్పేసింది.

By:  Tupaki Desk   |   25 July 2023 5:34 AM GMT
బాబు అప్పులు... జగన్ అప్పులు... లెక్క తేల్చేశారుగా...!
X

ఏపీ కి ఎన్ని అప్పులు ఉన్నాయంటే ఎవరికి వారుగా ఒక లెక్క చెబుతారు. విపక్షాలు అయితే ఏకంగా పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అంటూంటాయి. మరో వైపు చూస్తే చంద్రబాబు హయాం లోనే అప్పులు అంటుంది వైసీపీ ప్రభుత్వం. మీరే మొత్తం ఏపీ ని అప్పుల కుప్పగా చేశారు అని రివర్స్ అటాక్ చేస్తుంది టీడీపీ. పోనీ ఈ అప్పుల మీద శ్వేతపత్రం ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తే ఎంతో కొంత జనాల కు అర్ధం అవుతుంది అనుకుంటే ఆ పని చేయడంలేదు.

ఈ నేపధ్యంలో ఏపీ లో ఎన్ని అప్పులు ఉన్నాయి. అసలు చంద్రబాబు దిగిపోయే నాటికి ఎన్ని ఉన్నాయి, జగన్ గద్దెనెక్కి నాలుగెళ్ల పాలన తరువాత ఎన్ని ఉన్నాయి అన్న దాని మీద కేంద్రం క్లారిటీగా లెక్క చెప్పేసింది. ఏపీ లో అప్పులు చూస్తే చంద్రబాబు గద్దె దిగే ఏడాది 2019 మార్చి ఎండింగ్ నాటికి అప్పుల విలువ రూ.2.64 లక్షల కోట్లు అని పేర్కొంది.

అదే విధంగా జగన్ 2019లో సీఎం అయ్యారు. 2023-24 నాటికి ఏపీ లో అప్పుల విలువ ఎంత అన్నది కూడా కేంద్రం చెప్పుకొచ్చింది. ఆ విధంగా చూసుకుంటే ఏపీ లో అప్పులు విలువ 2023 మార్చి ఎండింగ్ నాటికి రూ.4.42 లక్షల కోట్లు అని వెల్లడించింది. ఈ మేరకు నామా నాగేశ్వరరావు ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.జగన్ రూలింగ్ లో కంటే చంద్రబాబు రూలింగ్ లోనే ఎక్కువ అప్పులు చేసారు అన్నట్టు ఇటీవల కాగ్ రిపోర్ట్స్ లో కూడా ఉన్నట్టు ఇటీవల చర్చ జరిగింది.

చిత్రమేంటి అంటే ఏపీ అప్పుల మీద తెలంగాణా కు చెందిన బీయారెస్ ఎంపీ ఆసక్తిని చూపించి ప్రశ్న వేయడం, దానికి కేంద్ర ఆర్ధిక మంత్రి బదులు ఇవ్వడం. మరి ఆయనకు ఏపీ మీద ఎందుకు ఇంటరెస్ట్, ఎందుకు ఈ వివరాలు అంటే ప్రతీ దానికీ ఏపీతోనే కేసీయార్ పోల్చుకుని తెలంగాణా బెస్ట్ అంటూంటారు. బహుశా అప్పుల వివరాలు కూడా తీసుకుని ఇద్దరు సీఎం లు ఏపీ కి మారిన తరువాత కూడా ఎన్ని అప్పులు చేసారో అని రేపటి రోజున చెప్పడానికా అన్నది చర్చగా ఉంది.

అంతే కాదు తమ పాలనలో తెలంగాణా లో అప్పులు తక్కువ చేశామని చెప్పుకోవడం కూడా ఒక ఎత్తుగడగా చేసుకున్నారా అన్నదే ఇపుడు అందరికీ అర్ధమవుతోంది అని అంటున్నారు. సరే బీయారెస్ ఎంపీ అడిగారు, కేంద్రం చెప్పింది. కానీ ఏపీ అప్పుల మీద క్లారిటీ అయితే వచ్చింది కదా అని అంటున్నారు.

మరి ఇటీవలనే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి ఏపీ లో అప్పులు ఏకంగా పది లక్షల కోట్లు అని ఆరోపించారు. ఇదే మాటను చంద్రబాబు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటున్నారు. మాకు అన్ని అప్పులు లేవు నాలుగు లక్షల కోట్లే అని ఏపీ ప్రభుత్వం ఇపుడు మరోసారి చెబుతుందా లేక దీని మీద కూడా ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు అని గమ్మున ఊరుకుంటుందా. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఏపీ లో తెలంగాణా లో కూడా అప్పులే అతి పెద్ద ఎన్నికల అంశంగా మారబోతున్నాయని అంటున్నారు.