డిసెంబరు వస్తోంది.. మీ ఓటీపీ ఆలస్యం కావొచ్చు..మరిన్ని మార్పులు
ఓటీపీ తెలుసుకుని ఆన్ లైన్ మోసగాళ్లు ప్రజల ఫోన్లను యాక్సెస్ చేసి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు.
By: Tupaki Desk | 28 Nov 2024 1:22 PM GMT2024 వెళ్లిపోతోంది.. క్యాలెండర్ లో చివరి నెల అయిన డిసెంబరు వచ్చేస్తోంది. దీంతోనే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు మార్పులు రానున్నాయి. వీటిలో ముఖ్యమైనది వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ). ప్రస్తుతం అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్.. అందులో యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారానే చాలామంది చెల్లింపులు చేస్తున్నారు. అయితే, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల ఖాతాల నుంచి డబ్బు గుంజేస్తున్నారు. దీనంతటికీ కారణం.. ‘ఓటీపీ’ చెప్పేయడం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) డిసెంబరు నుంచి కొత్త నిబంధన తేనుంది.
ఓటీపీ తెలుసుకుని ఆన్ లైన్ మోసగాళ్లు ప్రజల ఫోన్లను యాక్సెస్ చేసి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు. దీనిని అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం కంపెనీలను గతంలో మెసేజ్ ట్రేస్‌బిలిటీని అందించమని కోరింది. తమ ఆదేశాన్ని పాటించడానికి ఈ నెల (నవంబర్) 30 వరకు గడువు ఇచ్చింది. దీని ప్రకారం అన్ని సందేశాలను ట్రేస్ చేయడానికి టెలికాం కంపెనీలు నిబంధనలను రూపొందించాలి. ఇంతకుముందు అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చినా.. సర్వీస్ ఆపరేటర్ల నుంచి వినతులతో నవంబర్ 30 వరకు పొడిగించింది. అప్పటికీ కంపెనీలు పాటించడంలో విఫలమైతే, వినియోగదారులు ఓటీపీలను పొందడం ఆపివేయొచ్చు. లేదా అవి ఆలస్యం కావచ్చు.
ప్రతి నెల మాదిరిగానే.. ఆర్థిక వ్యవహారాల విషయంలోనూ డిసెంబరు నుంచి మార్పులు రానున్నాయి. చాలావాటికి ఈ నెలే డెడ్ లైన్. వీటిలో ఆధార్ ఉచిత అప్ డేట్, స్పెషల్ ఎఫ్‌డీల గడువులు డిసెంబరుతో ముగియనున్నాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని మార్పులు రానున్నాయి.
ఆధార్ మళ్లీ పొడిగిస్తారా?
ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 14 వరకు గడువు పొడిగించింది. కార్డులో చిరునామా మార్పులకు ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. లేదంటే గడువు తర్వాత ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి మార్చుకోవాల్సి ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంక్ ఉత్సవ్ స్పెషల్ డిపాజిట్ గడువు వచ్చే నెల 31తో ముగియనుంది. 300 రోజులు, 375 రోజులు, 444 రోజులు, 700 రోజుల గడువు ఈ ఎఫ్‌డీలను ఈ బ్యాంక్ అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.05%, 7.25%, 7.35%, 7.20% శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనం. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీములూ డిసెంబరుతో ముగియనున్నాయి. పౌరులకు 222 రోజులకు 6.30%, 333 రోజులకు 7.20%, 444 రోజులకు 7.30%, 555 రోజులకు 7.45%, 777 రోజులకు 7.25%, 999 రోజులకు 6.65% చొప్పున వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
క్రెడిట్ కార్డుల చార్జీల బాదుడు
క్రెడిట్ కార్డుల సంఖ్య పెరగడం.. డిఫాల్టర్లూ అధికంగా ఉండడం.. వివిధ పద్ధతుల్లో వాడకం నేపథ్యంలో బ్యాంకులు నిబంధనలను కఠినం చేస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ చార్జీలను 3.6 శాతం నుంచి 3.75 శాతానికి పెంచింది. రెంటల్ పేమెంట్ పై ఒక శాతం ఫీజు వసూలు చేయనుంది. రూ.10 వేల పైన వాలెట్ లోడింగ్ లపైనా ఒక శాతం ఫీజు వసూలు చేయనుంది. అయితే, ఈ మార్పులు డిసెంబరు 1 నుంచి కాకుండా 20 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏయూ కార్డుపైనా
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ ఇక్సిగో ఏయూ క్రెడిట్ కార్డులో చేసిన మార్పులు డిసెంబరు 22 నుంచి అమల్లోకి రానున్నాయి. విద్య, ప్రభుత్వ చెల్లింపులపై ఇకపై రివార్డు పాయింట్లు లభించవు.
ఆలస్యమైన రిటర్నుల గడువు..
ఏ కారణంతో అయినా గత ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయకపోయి ఉంటే.. డిసెంబరు 31లోగా బిలేటెడ్ రిటర్నులు చెల్లించొచ్చు. జరిమానా చెల్లించి వీటిని దాఖలు చేయాల్సి ఉంటుంది.