Begin typing your search above and press return to search.

టైం వేస్ట్: డీప్ సీక్ ను ఆ విషయాల్ని అడగొద్దు బాస్!

యావత్ టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన చైనా డీప్ సీక్ కు సంబంధించి విశేషాలు బయటకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   31 Jan 2025 5:15 AM GMT
టైం వేస్ట్: డీప్ సీక్ ను ఆ విషయాల్ని అడగొద్దు బాస్!
X

యావత్ టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన చైనా డీప్ సీక్ కు సంబంధించి విశేషాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడున్న ఏఐ టూల్స్ కు సవాలు విసిరేలా.. ఓపెన్ ఫ్రీ సోర్సుతో వచ్చిన డీప్ సీక్ మీద అందరికి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో చైనాకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పని డీప్ సీక్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. డీప్ సీక్ లెక్క తేల్చేందుకు.. అదిచ్చే సమాధానాలను పలు విధాలుగా పరీక్షించేందుకు పలు ప్రశ్నల్ని సంధించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి,

మిగిలిన ఏఐ టూల్స్ అయిన జెమినా.. చాట్ జీపీటీలు ఇవే ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వటం గమనార్హం. దీంతో.. డీప్ సీక్ ఇచ్చే సమాచారంపై చైనా సర్కారు సెన్సార్ షిప్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ చాట్ బాట్ ను పలు వివాదాస్పద అంశాల్ని ప్రస్తావించినప్పుడు ఎలాంటి సమాధానాల్ని ఇస్తుందో చూసినప్పుడు.. దీని పని తీరు ఏ రీతిలో ఉంటుందన్న విషయంపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పాలి.

అదే సమయంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ హౌస్ నుంచి తాజాగా విడుదలైన అధికారిక ఉత్తర్వు ఏమిటి? చక్కటి జోక్ ఏదైనా చెప్పు లాంటి అంశాలపై రెప్పపాటులో బదులిస్తున్న డీప్ సీక్.. పలు వివాదాస్పద అంశాలు.. ముఖ్యంగా చైనాకు ఇబ్బంది కలిగించే అంశాలపై ‘డీప్ సీక్’ మాత్రం తెలివిగా తప్పుకుంటోంది. అదెల రియాక్టు అవుతుందన్నది చూస్తే..

తియానన్మెన స్క్వేర్

1989 జూన్ నాలుగున బీజింగ్ లోని తియానన్మెన్ స్క్వేర్ లో జరిగిన అందోళనలో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. దీంతో.. వేలాది మంది ఆందోళనాకారులు మరణించారు. ఇదే అంశంపై అడిగితే..

‘‘ఈ రకమైన ప్రశ్నను ఎలా ఎదుర్కోవాలో ఇంకా నాకు కచ్ఛితంగా తెలీదు. ఎలా సమాధానం చెప్పాలో తెలీనందుకు సారీ’’ అని బదులిస్తోంది.

భారత్ - చైనాకు సంబంధించిన వివాదాస్పద అంశాలు.. చైనా - తైవాన్ సంబంధాలు.. ఇతర రాజకీయ సున్నిత అంశాలపైనా ప్రశ్నిస్తే.. ఒకేలాంటి క్షమాపణలు చెప్పటం కనిపిస్తోంది. చైనా అంతర్గత అంశాలపైనా ఆచితూచి స్పందిస్తోంది. వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లో వీగర్ ముస్లిం పట్ల చైనా ప్రభుత్వం అణిచివేసిన వైనంపై ప్రశ్నించినప్పుడు.. ‘‘ఈ ప్రశ్న నా ప్రస్తుత పరిధికి అతీతమైంది’’ అంటూ బదులిస్తోంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గురించి అడిగినా.. తన ప్రస్తుత పరిధికి మించిందన్న సమాధానాన్ని ఇస్తోంది. అదే సమయంలో కొన్ని ప్రశ్నలకు చైనాకు అనుకూలమైన ఆన్సర్లు ఇవ్వటం గమనార్హం. ‘నాన్షా ద్వీపాలు. వాటిపై ఎవరికి హక్కు ఉంది’ అని ప్రశ్నిస్తే.. ఆ జలాలపై చైనాకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉందంటూ చైనా ప్రభుత్వ అధికారిక ప్రకటనల్లో ఎలా అయితే చెబుతారో అలాంటి సమాధానాన్నే డీప్ సీక్ చెప్పటం గమనార్హం.

వివాదాస్పద అంశాలపై తన వద్ద ఇంకా ఆ సమాచారం లేదన్న డీప్ సీక్.. భారత్ - చైనా మధ్య జరిగిన యుద్ధం లాంటి చారిత్రక అంశాల్ని ప్రశ్నిస్తే.. తెలివిగా తప్పించటం కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో భాగమా? అని అడగ్గా.. డీప్ సీక్ బదులిస్తూ.. ‘సారీ.. ఇది నా ప్రస్తుత పరిధికి అతీతమైన ప్రశ్న’ అంటూ సమాధానం ఇస్తోంది. అదే పనిగా ఆ తరహా ప్రశ్నల్ని అడిగితే.. మనం ఇంకేదైనా మాట్లాడుకుందామని సూచన చేయటం గమనార్హం. టిబెట్.. దలైలామా గురించి ప్రశ్నిస్తే సూటిగా.. వాస్తవానికి దగ్గరగా ఉండే సమాధానాన్ని ఇవ్వకుండా.. కొన్ని అంశాలకు.. ఎలాంటి వివాదాలకు చోటు రాని విధంగా సమాధానం ఇవ్వటం కనిపిస్తోంది. మొత్తంగా.. చైనాకు ఇబ్బంది కలిగే.. చైనాను తప్పు పట్టే అంశాలకు దూరంగా తాను ఉంటానన్న విషయాన్ని డీప్ సీక్ తన సమాధానాల్లో స్పష్టం చేస్తుందని చెప్పాలి.