దీపక్ మిశ్రా వల్లే విధ్వంసం... గవర్నర్ ముందు వైసీపీ నేతలు!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 16 May 2024 2:18 PM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అవి పోలింగ్ పూర్తయ్యి రెండు మూడు రోజులు గడుస్తున్నా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఫలానా పార్టీకి ఓటు వేశారనే కారణంతో ఇళ్లపై దాడులకు బరితెగించే పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై పలు విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.
ప్రధానంగా ఏపీ ఎలక్షన్స్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పోలింగ్ కు ముందు చంద్రబాబు అత్యంత సన్నిహితుడైన ఓ అధికారి ఇంటికి ఎందుకు వెళ్లారో చెప్పాలని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు! ఈ నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా తయారవుతుండటంతో వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు పోలీసుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు తెల్లుస్తుంది.
అవును... మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ నేతల బృంధం ఏపీ గవర్నర్ ను కలిసింది. ఈ సందర్భంగా ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసపై వారు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా... ఏపీలో జరిగిన, జరుగుతున్న హింసాత్మక సంఘటనలు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీలు ఉద్దేశ పూర్వకంగానే తెచ్చిపెట్టాయని.. అతని వల్లే రాష్ట్రంలో ఈ విధ్వంసం అని పేర్ని నాని ఆరోపించారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చినప్పటి నుంచీ టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారని.. పలువురు జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని.. పోలింగ్ పూర్తయినా కూడా ఆయన ఏపీని వదిలి వెళ్లటం లేదని మండిపడ్డారు!
ప్రతి హింసకు పాల్పొడొద్దన్న జగన్!:
పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ వాళ్లు హింసకు పాల్పడ్డారని.. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో విధ్వంసం సృష్టించాయని మండిపడిన పేర్ని నాని... పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఎన్నికలు జరిపారని తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది పోలీసు అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో... ప్రతిహింసకు పాల్పడొద్దంటూ తమ పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఫోన్ చేసి చెప్పారని.. వచ్చేది మన ప్రభుత్వమే, హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకుందామని తెలిపారని.. సంయమనం పాటించాలని క్యాడర్ కు సూచించారని పేర్ని నాని తెలిపారు.