Begin typing your search above and press return to search.

మరో హామీకి ఒకే...దీపావళి పండుగ చేస్కోండిక!

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలకమైన హామీని నెరవేర్చేందుకు ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 3:50 AM GMT
మరో హామీకి ఒకే...దీపావళి పండుగ చేస్కోండిక!
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలకమైన హామీని నెరవేర్చేందుకు ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తి అయింది. ఎన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది.

ఇక ఏపీలో పేదలకు ఈసారి దీపావళి నవ్య దీపావళి చేయాలని నిర్ణయించింది. పేదల ఇంట పొయ్యి కింద పొయ్యి మీద కూడా వెలుగులు చూడాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతీ పేద కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు దీపం పధకం కింద పేదలకు దీనిని వర్తింపచేయనున్నారు. దానిని సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ లోనే శాశ్వత నివాసం ఉండాలి.

ఒక్కటే గ్యాస్ కనెక్షన్ లబ్దిదారులకు ఉండాలి. ఆర్ధికంగా వెనకబడిన వారే ఈ పధకానికి పూర్తిగా అర్హులు. బీపీఎల్ కుటుంబాలే దరఖాస్తు చేసుకోవాలి.దీంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారినే ప్రమాణంగా తీసుకుంటారు.

ఇదిలా ఉంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈనెల 31వ తేదీ నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తామని బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి సమీక్షించారు.

అంతే కాదు ఉచితంగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల వ్యవధిలోనే వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని ఆ మేరకు ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో తాము హామీ ఇచ్చినట్లుగానే ఉచిత గ్యాస్ పధకాన్ని దీపావళి పండుగతోనే అమలు చేస్తున్నామని అన్నారు.

రాష్ట్రం ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోందని అయితే పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పధకాన్ని రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో అందరికీ అందించడం జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర ప్రస్తుతం 876 రూపాయలుగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు పాతిక రూపాయలు వంతున సబ్సిడీ ఇస్తోనిద్. దాంతో ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర 851 రూపాయలుగా ఉంది. ఇక పేదలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై ఏకంగా 2,684 కోట్ల భారం పడనుంది. అది కాస్తా మొత్తం అయిదేళ్లకు లెక్క తీస్తే కనుక 13,423 కోట్ల రూపాయల భారం పడుతుంది.