చైనా, ఫిలిప్పీన్స్ మధ్య చిచ్చురేపిన డీప్ ఫేక్ వీడియో!
అవును... ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్.. "చైనా నుంచి ముప్పు పొంచి ఉంటే తక్షణమే దాడి చేయాలి" అంటూ తన మిలిటరీకి సూచించిన ఫేక్ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 26 April 2024 3:39 AM GMTడీప్ ఫేక్ అనే సమస్య ఇటీవల కాలంలో తెరపైకి వచ్చి చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. సెలబ్రెటీల ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలూ క్రియేట్ చేస్తూ నెట్టింట తీవ్ర వివదాలకు నెలవైంది. ఈ సమయంలో ఏకంగా దేశాధ్యక్షుల వాయిస్ లను ఫేక్ చేస్తూ.. ఇతర దేశాలపై యుద్ధానికి సైన్యాన్ని అలర్ట్ చేసే పనులకు పూనుకుంటుంది. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో అలాంటి సమస్యను ఎదుర్కొంది ఫిలిప్పీన్స్!
అవును... ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్.. "చైనా నుంచి ముప్పు పొంచి ఉంటే తక్షణమే దాడి చేయాలి" అంటూ తన మిలిటరీకి సూచించిన ఫేక్ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో... ఇది దేశ విదేశాంగ విధానానికి చిక్కులను కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ డీప్ ఫేక్ చేయబడిన ఆడియో మార్కోస్ జూనియర్ కి సంబంధించిన దాదాపు స్పష్టమైన స్వరాన్ని కలిగి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. చైనా, ఫిలిప్పీన్స్ కు ముప్పు కలిగిస్తే జోక్యం చేసుకోవాలని అతను తన మిలిటరీకి సూచించాడు. బీజింగ్ ద్వారా ఫిలిపినోలకు మరింత హాని జరగడాన్ని తాను ఏమాత్రం సహించలేనని ఆయన ఆ ఆడియో క్లిప్ లో చెప్పారు.
ఇదే క్రమంలో... ఈ ఆడియోతో పాటు దక్షిణ చైనా సముద్రంలో చైనా నౌకలను చూపిస్తున్న ఫోటోల స్లైడ్ షో కూడా ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రెసిడెన్షియల్ కమ్యూనిటీ కమ్యూనికేషన్స్ ఆఫీస్... ఈ డీప్ ఫేక్ గురించిన బహిరంగ హెచ్చరికను జారీ చేసింది... ఇది పూర్తిగా నకిలీదని ధృవీకరించింది. ఇదే సమయంలో నిందితులపై చర్యలకు ఆదేశించింది!
ఇదే క్రమంలో... ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ వాయిస్ ని పోలిన ఆడియోను రూపొందించిన వీడియో కంటెంట్ ఆన్ లైన్ లో సర్క్యులేట్ అవుతున్న ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేయబడిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని.. ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాంటి ఆదేశం ఏదీ వాస్తవం కాదని వెల్లడించింది!