ఓడిపోయి వస్తున్నా.. మంత్రి నిరంజన్ కు చేదు అనుభవం తప్పలేదే?
ఎన్నికల వేళ గెలుపోటములు సహజం. తాజాగా వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది అధికార బీఆర్ఎస్.
By: Tupaki Desk | 4 Dec 2023 6:38 AM GMTఎన్నికల వేళ గెలుపోటములు సహజం. తాజాగా వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది అధికార బీఆర్ఎస్. ఆ పార్టీకి వచ్చిన 39 స్థానాల్లో గ్రేటర్ పరిధిలోని 16 స్థానాలు తీసేస్తే.. తెలంగాణ మొత్తం మీద వచ్చిన స్థానాలు అక్షరాలు 23. అందులో కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ లను తీసేస్తే మిగిలేది ఇరవై మాత్రమే. 119 స్థానాల్లో తమ పార్టీకి వచ్చిన ఈ స్థానాలతో షాక్ తిన్నపరిస్థితి. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతటి షాకిచ్చిందన్న విషయం కేటీఆర్ మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించింది. కాకుంటే.. అతిగా ఆవేశపడకుండా.. సమయానికి తగ్గట్లుగా స్పందించి ఊరుకున్నారు.
తాజా ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు ఎందరో ఉద్దండులకు ఎదురుదెబ్బలు తప్పలేదు. ఇక.. మంత్రుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటివరకు తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించిన ఎందరో మట్టి కరిచిన పరిస్థితి. అయితే.. అందరి ఓటమి ఒక ఎత్తు.. మంత్రి నిరంజన్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవం మరో ఎత్తు. కౌంటింగ్ లో తన ఓటమి ఖరారైందన్న విషయాన్ని గుర్తించిన ఆయన వెనక్కి తిరిగి వెళుతున్న వేళ.. మంత్రి కారుపై దాడి జరిగిన తీరు సంచలనంగా మారింది.
ఫలితాల సరళిని అంచనా వేసిన ఆయన పన్నెండో రౌండ్ తర్వాత నడుచుకుంటూ లెక్కింపు కేంద్రం నుంచితిరిగి బయలుదేరారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కాంగ్రెస్ సానుభూతిపరులు మంత్రి బై..బై.. అంటూ నినాదాలు చేశారు. ఓటమి వేళ.. ఇలాంటివి మామూలే అయినా.. అనూహ్యంగా ఆయన కారును అడ్డుకున్న గుర్తు తెలియని వ్యక్తులు.. కారు అద్దాల్ని ధ్వంసం చేయటం మాత్రం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలో పోలీసులు మంత్రి కారు మీద దాడి చేసే వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే మంత్రి కారుకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
కారులో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు.. పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. గాంధీ చౌక్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి అతి కష్టమ్మీద బయటకు వచ్చిన అనంతరం.. ఇంటికి వెళ్లే క్రమంలో మరోసారి ఆయన కారును అడ్డుకున్నారన్నమాట వినిపిస్తోంది. ఓవైపు ఎన్నికల్లో ఓటమి భారం ఒక ఎత్తు అయితే.. మరోవైపు మరే మంత్రికి ఎదురుకాని రీతిలో వాహనాన్ని అడ్డుకొని.. దాడి చేసిన వైనం మాత్రం షాకింగ్ గా మారిందని చెప్పాలి.