1956-93.. ఢిల్లీకి అసెంబ్లీనే లేదు.. ఎందుకో తెలుసా?
స్వాతంత్రం సాధించాక ఐదేళ్లకు అంటే 1952లో ఢిల్లీ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి.
By: Tupaki Desk | 8 Feb 2025 7:30 PM GMTఉన్నది 70 సీట్లే అయినా దేశ రాజధాని ఢిల్లీ ‘అసెంబ్లీ’ ఎన్నికలు ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారాయి. కారణం.. దాదాపు 11 ఏళ్ల కిందటనే ఢిల్లీలో బీజేపీ గద్దెనెక్కినా.. ‘ఢిల్లీ’ని మాత్రం దక్కించుకోలేకపోవడం. అసలు 27 ఏళ్లయింది అక్కడ కమలం పార్టీ గెలిచి. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించడమే కాక.. తమకు కంట్లో నలుసులా మారిన ఆప్ అధినేత కేజ్రీవాల్ నూ ఓడించింది కమలం. అందుకే ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకంగా నిలిచాయి.
స్వాతంత్రం సాధించాక ఐదేళ్లకు అంటే 1952లో ఢిల్లీ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అయితే, నాలుగేళ్లు మాత్రమే శానస సభ కొనసాగింది. మళ్లీ ఆ తర్వాత 1993 వరకు ఎన్నికలు నిర్వహించలేదు. అసలు అసెంబ్లీనే మనుగడలో లేదు.
ఏపీ ఏర్పాటుతో..
1956 నవంబరు 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ-ఆంధ్రా కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇదే సమయంలో ఢిల్లీ రాష్ట్ర హోదాను కోల్పోవడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మారింది. దీంతోపాటు ఢిల్లీ మున్సిపల్ చట్టం వచ్చింది. అప్పుడు 56 మంది ఎన్నికైన, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నియమించిన ఐదుగురు సభ్యులు ఇందులో ఉండేవారు. వీరు కేవలం డివిజన్ కార్పొరేటర్ స్థాయి అన్నమాట. వీరికి శాసనాధికారాలు ఉండవు. 1991లో 69వ సవరణ ద్వారా ఢిల్లీ అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది. అయితే, పూర్తి అధికారాలు ముఖ్యమంత్రి చేతిలో ఉండవు. దేశ రాజధాని కావడంతో చాలావరకు కేంద్రం పరిధిలో ఉంటాయి.
అసెంబ్లీ పునరుద్ధరణ తర్వాత 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది. అప్పట్లో మదన్ లాల్ ఖురానా, సాహెబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ సీఎంలుగా పనిచేశారు. 1998లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 2014 వరకు ఆ పార్టీనే అధికారంలో ఉంది.