ఢిల్లీ ప్రజలకు ఉచితాలే ఉచితాలు.. హామీలే హామీలు.. పార్టీల కొత్త పంథా
తాము ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా మార్చేస్తామని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. తాము గెలిస్తే ఏ ఓటర్ కు ఎంత ఇస్తామో మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాయి.
By: Tupaki Desk | 12 Jan 2025 5:41 AM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రధాన పార్టీలు అనేక హామీలను గుప్పిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే తమ మేనిఫెస్టోలో ఆయా హామీలను చేరుస్తున్నాయి.
తాము ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా మార్చేస్తామని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. తాము గెలిస్తే ఏ ఓటర్ కు ఎంత ఇస్తామో మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాయి. మేనిఫెస్టోలను పుస్తకాల రూపంలో ప్రచురించి మరి ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కేజ్రీవాల్.. తనను రాజకీయ కుట్రలతో అరెస్టు చేశారన్న సానుభూతి పొందడంతో పాటు ఉచిత పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఉచిత బస్సు అనే కాన్సెప్ట్ మొదటి తీసుకువచ్చి అమలు చేసి మహిళల అభిమానాన్ని పొందిన పార్టీగా ఆప్ గుర్తింపును దక్కించుకుంది. ఆ పథకం పేరుతో ప్రతిసారి ఓట్లు పొందలేమని భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్.. ఈసారి మరిన్ని ఎక్కువ హామీలను అందించడంపై దృష్టి సారించారు. మహిళలకు ప్రతినెల అకౌంట్లలో డబ్బులు వేస్తామని, ఆసుపత్రి కత్తులు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఇందుకోసం ఆపు ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందిస్తోంది.
ఢిల్లీ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని భావిస్తున్న బిజెపి కూడా అధికారం దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఉచిత హామీల విషయంలో బిజెపి కూడా గీత దాటేసింది అనే చెప్పాలి. ప్రతి మహిళకు నేలకు రెండున్నర వేలు ఇస్తామన్న హామీతోపాటు ఉచిత విద్యుత్తు కూడా అందిస్తామని బిజెపి హామీ ఇస్తోంది. వీటితోపాటు మరిన్ని భారీ ప్రయోజనాలను కల్పిస్తామని చెబుతోంది. ఇంకా ఇలాంటి హామీలతో కూడిన మేనిఫెస్టోను బిజెపి నాయకులు సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్యారి దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 2500 ప్రతినెలా అందిస్తామని వాగ్దానం చేసింది. వీటితోపాటు ఇతర హామీలను అందించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండడంతో.. ఉచిత హామీలకు కేంద్రంగా ఢిల్లీ మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రధాన పార్టీలన్నీ మహిళలను లక్ష్యంగా చేసుకుని పలు హామీలను గుప్పిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు కూడా మహిళలకు ఇచ్చిన హామీలపై ఆధారపడి ఉండడంతో ఢిల్లీలోని ప్రధాని పార్టీలు కూడా ఆ దిశగానే దృష్టి సారిస్తున్నాయి. వీటితోపాటు 300 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు, నల్లా నీళ్లు, బస్సు మెట్రోలో ఉచిత ప్రయాణం అవకాశం వంటి వాటిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేవాలయాలు, గురుద్వారాలకు నెలకు 5 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీమ్ అమలు చేసేందుకు ఆప్ తో పాటు బిజెపి కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి కూడా మహిళల కోసం ఇటువంటి పథకాలను తీసుకువచ్చేందుకు యోచిస్తూ ఉండడం గమనార్హం. అన్ని పార్టీలు ఉచితాలను అందించడం ద్వారా అధికారంలోకి రావాలని యోచిస్తుండడం గమనార్హం.