Begin typing your search above and press return to search.

మన మదనపల్లె టీచర్.. ఢిల్లీ కొత్త సీఎం!

ఆతిశీ తల్లిదండ్రులు త్రిప్తా వాహి, విజయ్‌ కుమార్‌ సింగ్‌ లు ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్లు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 7:03 AM GMT
మన మదనపల్లె టీచర్.. ఢిల్లీ కొత్త సీఎం!
X

దేశ రాజధాని ఢిల్లీకి కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న ఆతిశీ మార్లేనా సింగ్... ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ ప్రొఫెసర్లు కావడమే దీనికి నిదర్శనం. పంజాబీ నేపథ్యం ఉన్నప్పటికీ ఆతిశీ పూర్తిగా పుట్టి పెరిగింది ఢిల్లీలోనే కావడం గమనార్హం. ఇప్పుడు ఏకంగా ఆ రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. వాస్తవానికి ఆతిశీని ఒక ప్రాంతానికే పరిమితం చేయలేం. ఆమె ప్రోగ్రెసివ్ పర్సన్. అందుకనే నిజమైన ఇండియన్ గా ఆతిశీని చెప్పొచ్చు. ఉత్తర భారతంలో బలమైన ప్రభావం చూపే కులం ఆనవాళ్లను ఆమె దగ్గరకు రానీయలేదు. ఆతిశీది పంజాబీ నేపథ్యం ఉన్న తోమర్‌ రాజపుత్రుల వంశం. అయితే, తన పనితీరే తన సమాధానం అనేది ఆమె లక్షణం. అందుకే ఇంటి పేరు వాడుకోరు.

ఆతిశీ.. రైతు.. విద్యావేత్త..

ఆతిశీ తల్లిదండ్రులు త్రిప్తా వాహి, విజయ్‌ కుమార్‌ సింగ్‌ లు ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్లు. వారిది టీచింగ్ నేపథ్యం కావడంతోనో ఏమో.. ఆతిశీ కూడా బోధనా రంగంలో కొన్నాళ్లు కొనసాగారు. ఆతిశీ కూడా ఉన్నత చదువులు చదివారు. హిస్టరీ డిగ్రీ పూర్తి తర్వాత స్కాలర్‌ షిప్‌ తో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లి మాస్టర్స్‌ డిగ్రీ చదివారు. ప్రఖ్యాత రోడ్స్‌ స్కాలర్‌ గా అదే విశ్వవిద్యాలయంలో ‘ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌’ విభాగంలో రెండోసారి మాస్టర్స్‌ పట్టా అందుకున్నారు. కాగా, ఆతిశీ చదువుకు పెద్ద పెద్ద కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చేవి. కానీ, భర్త ప్రవీణ్ సింగ్ తో కలిసి ఆమె మధ్యప్రదేశ్ లోని మారుమూల గ్రామంలో ఏడేళ్లు సేంద్రియ వ్యవసాయం చేశారు. స్థానిక చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి పెంచారు. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. అదే సమయంలో ఆప్ ఏర్పడడం.. ఆ పార్టీ నాయకులు కలవడం.. రాజకీయాల్లోకి రావడం జరిగిపోయింది.

మన ఏపీలోనూ పనిచేశారు..

ఢిల్లీకి మూడో మహిళా సీఎం కానున్నా ఆతిశీ.. ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో 14 శాఖలను చూస్తున్నారు. మధ్యప్రదేశ్ లోనే కాదు.. ఏపీలోనూ ఆమె టీచర్ గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని ప్రఖ్యాత రిషీ వ్యాలీ స్కూల్ పిల్లలకు ఆతిశీ పాఠాలు బోధించారట. ఇది కూడా సరిగ్గా 2013 సమయంలోనే కావడం విశేషం. అంటే.. మధ్యప్రదేశ్ లో పనిచేస్తున్న సమయంలో, రాజకీయాల్లోకి వెళ్లకముందే ఆతిశీ మదనపల్లెలోని రిషీ వ్యాలీ స్కూల్ లో పాఠాలు చెప్పినట్లు తెలుస్తోంది. అది ఎంతకాలం అనేది మాత్రం తెలియరాలేదు. గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా, బోధన అనుభవం ఉన్న ఆతిశీ మనీశ్ సిసోడియా విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. సిసోడియాకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చారన్న పేరు రావడం వెనుక ఆతిశీ కూడా ఉన్నారు.