ఢిల్లీ ముచ్చట: ప్రచారం ముగిసింది.. `తాయిలాల` గురించి తెలుసా?!
ఎంత కట్టుదిట్టమైన ఎన్నికల సంఘం నిఘా ఉన్నప్పటికీ.. చాటు మాటుగా.. అయినా.. ఓటర్ల ను చుట్టేసి.. తాయిలాల మూట చేతిలో పెడతారు.
By: Tupaki Desk | 4 Feb 2025 12:30 AMఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు బుధవారం(5వ తేదీ) ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ ప్రకారం.. 36 గంటల ముందే.. ప్రచారానికి తెరపడింది. అంటే సోమవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీల మైకులు మూగబోయాయి. ఇక, సాధారణంగా.. ఏ చిన్న ఎన్నికలు జరిగినా.. ప్రచార పర్వం ముగిసిన వెంటనే.. పార్టీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందు కు తాయిలాల బాట పడతారు. ఎంత కట్టుదిట్టమైన ఎన్నికల సంఘం నిఘా ఉన్నప్పటికీ.. చాటు మాటుగా.. అయినా.. ఓటర్ల ను చుట్టేసి.. తాయిలాల మూట చేతిలో పెడతారు.
ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ మాటేంటి? ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు, నేతలు కూడా తాయిలాల బాట పడతారు కదా!? ఓటర్లకు అంతో ఇంతో డబ్బులు ముట్టచెబుతారుకదా! అని అనుకోవడం సహజం. కానీ, ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఢిల్లీలో కుదరదు. తాయిలాల పంపకాలు చేస్తామంటే.. అటు కేంద్రం, ఇటు ఎన్నికల సంఘం రెండూ కూడా ఒప్పుకోవు. ఇది ఆది నుంచి అమలవుతున్న నిబంధన. ఢిల్లీ రాష్ట్రం చిన్నది కావడంతోపాటు ప్రత్యేక నిఘా మరింత ఎక్కువగా ఉంటుంది.
దీనికితోడు ఎన్నికల సమయంలో మరింత ఎక్కువగా ఈ నిఘా కొనసాగుతుంది. దీంతో తాయిలాలు పంచేందుకు నాయకులు, పార్టీలు కూడా జంకుతాయి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా.. జాతీయ మీడియా కూడా వెయ్యికళ్లు పెట్టుకుని చూస్తుంది. పైగా.. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి. దీంతో తాయిలాలు పంచి ఓట్లు వేయించుకున్నారన్న అపప్రద ప్రపంచ వ్యాప్తంగా పాకిపోతుంది. ఈ నేపథ్యంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. దీనికితోడు.. పార్టీలు కూడా ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా పంపకాలకు తెరదీయదు. సో.. మొత్తంగా ఢిల్లీ ఒక్క చోట మాత్రమే రూపాయి ఇవ్వకుండా..(తీసుకునే వారు ఉన్నా కూడా ఇచ్చేవారు ఉండరు) ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇదిలావుంటే.. ఎన్నికల ప్రచారం చివరి రోజు సోమవారం.. బీజేపీ తరఫున పలువురు ముఖ్యమంత్రులు, నాయకులు ప్రచారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు బరిలో ప్రచారానికి దిగారు. ఇక, మాజీ సీఎం కేజ్రీవాల్ తన దారిలో తాను ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ``ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తన పదవికి విరమణ చేశాక.. కేంద్రం పెద్దపదవిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది`` అని ఆయన ప్రచారంలో వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనపై చర్యలకు ఈసీ సిద్ధమైంది.