Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బయటకు రాని ఆసక్తికర అంశాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఓట్ల లెక్కింపు వేళ.. చీపురు పార్టీని కమలం ఊడ్చేసిందన్న వాదనలు వినిపించాయి.

By:  Tupaki Desk   |   10 Feb 2025 5:30 AM GMT
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బయటకు రాని ఆసక్తికర అంశాలు
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఓట్ల లెక్కింపు వేళ.. చీపురు పార్టీని కమలం ఊడ్చేసిందన్న వాదనలు వినిపించాయి. అయితే.. ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత.. ఆయా పార్టీలు సాధించిన సీట్లు.. వాటి మెజార్టీలు.. అభ్యర్థులు సాధించిన అధిక్యతలు.. గత ఎన్నికల ఫలితాల్లో రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం.. తాజాగా చోటు చేసుకున్న మార్పులు లాంటి అంశాలపై ఫోకస్ చేస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ రెండూ హోరాహోరీగా తలపడిన విషయం అర్థమవుతుంది. సీట్ల పరంగా చూస్తే.. బీజేపీ భారీగా సీట్లను సొంతం చేసుకున్నట్లు కనిపించినా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి తక్కువ రేంజ్ లోనే ఎదురైన వైనం అర్థమవుతుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తాజా ఫలితాల్ని విశ్లేషిస్తే.. తక్కువ మెజార్టీతో బీజేపీ విజయం సాధించిన విషయం అర్థమవుతుంది. అలా అని బీజేపీ విజయాన్ని చూపించాలన్నది మా ఉద్దేశం కాదు. ఎన్నికల ఫలితాల్ని చూసినపపుడు.. గణాంకాల లోతుల్లోకి వెళ్లినప్పుడు ఉండే వ్యత్యాసాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయన్నది ఢిల్లీ ఫలితాల్ని విశ్లేషిస్తే అర్థమవుతుంది.

2020తో పోలిస్తే తక్కువ మెజార్టీతో విజయం సాధించిన వైనం కనిపిస్తుంది. పది వేల కంటే తక్కువ మెజార్టీతో పార్టీలు విజయం సాధించిన స్థానాలు 24. అదే 2020 ఎన్నికల్లో వీటి సంఖ్య 15 మాత్రమే. ఈ 24 స్థానాల్లో బీజేపీ గెలిచినవి 16 కాగా.. ఆప్ కు దక్కినవి 8 మాత్రమే. అంటే.. తక్కువ మెజార్టీతో విజయాన్ని సాధించిన బీజేపీ అధికారపక్షంగా అవతరిస్తే.. తక్కువ మెజార్టీతో ఓడిన స్థానాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారాన్ని దూరమయ్యేలా చేవాయి.

2020 ఎన్నికల్లో 33 స్థానాల్లో 10 వేలకు మించిన మెజార్టీ రాగా.. ఈసారి 29 స్థానాలకు తగ్గింది. ఈ ఎన్నికల ఫలితాల గణాంకాల్ని చూస్తే.. 13 అసెంబ్లీ స్థానాల్లో 5 వేల లోపు ఓట్ల మెజార్టీ నమోదైంది. అదే సమయంలో భారీ మెజార్టీతో గెలిచిన స్థానాలు తగ్గాయి. 2020 ఎన్నికల ఫలితాల్లో 22 స్థానాల్లో 25వేలకు మించిన మెజార్టీతో అభ్యర్థులు విజయం సాధిస్తే.. ఈసారి అది 17 స్థానాలకే పరిమితమైంది.

అతి తక్కువ ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ అభ్యర్థుల్ని చూస్తే.. సంగం విహార్ నియోజకవర్గంలో బీజేపీ నేత చందన్ కుమార్ చౌదరి కేవలం 344 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.అదే విధంగా త్రిలోక్ పురీలో 392 ఓట్లు.. జంగ్ పురాలో 675 ఓట్ల మెజార్టీతోనే బీజేపీ అభ్యర్థులు గట్టెక్కారు. 2020లో 5 వేల లోపు మెజార్టీలు 7 కాగా.. ఈసారి పదిగా నమోదయ్యాయి. మొత్తంగా ఈ గణాంకాల్ని చూసినప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ - ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీగా సాగినట్లుగా అర్థమవుతుంది. ఇదంతా చూసినప్పుడు కాంగ్రెస్ తో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ పొత్తు పెట్టుకుంటే.. ఆశ్చర్యకర ఫలితాలు వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదేమో అన్న అభిప్రాయం వ్యక్తం కాక మానదు.