Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఓటరు షాక్ ఇస్తాడా ?

అదే సమయంలో ఢిల్లీ ఓటర్లు మాత్రం పెద్దగా ఈ ఎన్నికల పట్ల ఆసక్తిని చూపించడం లేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 5:30 AM GMT
ఢిల్లీ ఓటరు షాక్ ఇస్తాడా ?
X

దేశంలో ఇపుడు అందరికీ ఆకట్టుకుంటున్న ఎన్నికలు ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 5న జరిగేవిగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది దేశంలో రాజకీయాల పట్ల అవగాహన ఆసక్తి ఉన్న వారిలో ఉత్సాహం పెంచుతోంది. అదే సమయంలో ఢిల్లీ ఓటర్లు మాత్రం పెద్దగా ఈ ఎన్నికల పట్ల ఆసక్తిని చూపించడం లేదు అని అంటున్నారు.

వారిలో ఒకింత ఎన్నికల వైరాగ్యం కూడా ఏర్పడింది అని అంటున్నారు. ఎవరు వస్తేనేమిటి అన్న భావనతో ఢిల్లీ ఓటరు ఉన్నారని అంటున్నారు. ఇంతలా నిరుత్సాహం ఎందుకు అంటే ఆప్ ప్రభుత్వం మీద కోటి ఆశలు పెంచుకుని పన్నెండేళ్ళుగా మోశారు. అయితే ఆప్ కొన్ని మంచి పనులు చేసినా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి.

ముఖ్యంగా ఢిల్లీ వాసులకు స్వచ్చమైన గాలి కావాలి. కాలుష్యం కోరలలో ఢిల్లీ చిక్కుకుంది. దానికి పరిష్కారం అయితే లేదు. అంతే కాదు ఆప్ అధినేత కేజ్రీవాల్ కొత్తగా ముఖ్యమంత్రి అయినపుడు సాదా సీదాగా కనిపించేవారు. అందరి మాదిరిగానే పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణం చేసేవారు. అయితే ఆయన అత్యాధునికమైన శీష్ మహల్ భవనం కట్టుకున్నారు అని బీజేపీ ఆరోపిస్తోంది. జనాలు కూడా దాని మీద చర్చించుకుంటున్నారు.

ఇక లిక్కర్ స్కాం ఉండనే ఉంది. దీనిని నమ్మే వారూ నమ్ముతున్నారు. ఏది ఏమైనా పూర్వం మాదిరిగా అయితే అరవింద్ కేజ్రీవాల్ క్రేజ్ అయితే లేదు అని అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఢిల్లీ కాలుష్యంతో పాటు స్థానిక సమస్యల మీద తన వంతుగా స్పందించలేదు అన్న ఆగ్రహం ఉంది. ఎంతసేపూ ఆప్ ని విమర్శించడం తప్ప తాము చేసింది ఏమిటి అని ప్రజలలో ఆగ్రహం ఉంది అంటున్నారు

అంతే కాదు ఢిల్లీలో గెలిచిన ఆప్ ని సరిగ్గా పాలించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచేసారు అన్నది కూడా జనంలో చర్చగా ఉంది. బీజేపీ వచ్చినా ఏమి ఉంటుంది అన్న నిర్వేదం కూడా జనాలొలో ఉందట. సందట్లో సడేమియా అన్నట్లుగా కాంగ్రెస్ పోటీ చేస్తోంది అని అంటున్నారు. ఆ పార్టీ గెలుస్తుంది అని వారే అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా పెద్దగా ఫోకస్ చేయడంలేదు.

ఇక జనాలు ఎందుకు ఆ వైపు చూస్తారు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఫలనా పార్టీని గెలిపించాలి వారితో తమ జీవితాలను బంగారం చేసుకోవాలన్న పట్టుదల కానీ కోరిక కానీ ఆకాంక్షలు కానీ పెద్దగా లేని ఈ ఎన్నికలు ఈసారి ఏ రకమైన ఫలితాన్ని ఇస్తాయో అని అంతా అంటున్నారు. మరి పోలింగ్ గతసారి కంటే మించుతుందా తగ్గుతుందా అన్నద్ దానిని బట్టి ఢిల్లీ ఓటరు తీర్పు అర్ధం అయిపోతుంది అని అంటున్నారు.