బీజేపీ విజయానికి మూడు మెట్లు.. అందులో ఒకరు రాహుల్?
దేశ రాజధాని ఢిల్లీని 12 ఏళ్లుగా పాలిస్తున్న ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ ఊడ్చిపారేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై కమలనాథులు జెండా ఎగరేస్తున్నారు
By: Tupaki Desk | 8 Feb 2025 6:59 AM GMTదేశ రాజధాని ఢిల్లీని 12 ఏళ్లుగా పాలిస్తున్న ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ ఊడ్చిపారేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై కమలనాథులు జెండా ఎగరేస్తున్నారు. ఈ అనూహ్య విజయానికి బీజేపీకి మూడు అంశాలు కలిసొచ్చాయని అంటున్నారు. అందులో ప్రధానంగా ఇండి కూటమిలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయడం ఆప్ ని దెబ్బతీసిందని చెబుతున్నారు. అదేవిధంగా మధ్యతరగతి, పూర్వాంచల్ ఓటర్ల ఆదరణ బీజేపీని గెలుపు తీరాలకు చేర్చిందని విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీ నలుమూలలా కమల వికసించింది. ఆప్ కోటలను బద్ధలు కొట్టి కొత్త రికార్డులు నెలకొల్పింది. 27 ఏళ్లుగా కలగా మారిన ఢిల్లీ గద్దెను అందుకుంది బీజేపీ. ఈ అనూహ్య విజయానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది మధ్య తరగతి ఓటర్ల ప్రభావం. ఢిల్లీలో ఎక్కువగా మధ్యతరగతి వారే నివసిస్తుంటారు. కేవలం ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తుంటారు. గత 12 ఏళ్లు ఆప్ కి వెన్నుదన్నుగా నిలిచిన ఈ వర్గం వారు ఈ సారి బీజేపీకి జైకొట్టారు. దీనికి ప్రధాన కారణం ఆప్ పార్టీపై అసంతృప్తితోపాటు ఇటీవల బడ్జెట్ లో ప్రతిపాదించిన పన్ను వెసులుబాటు అంటున్నారు. అదేవిధంగా పూర్వాంచల్ ఓటర్ల ప్రభావం బీజేపీ విజయానికి దోహదపడిందని అంటున్నారు. ఢిల్లీలో దాదాపు 25 సీట్లలో ఈ ఓటర్ల ప్రభావం చూపుతారని అంచనాలు ఉన్నాయి. ఈ అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. ట్రాన్స్ యమునా ప్రాంతంలో 20 సీట్లలో 10 సీట్లను బీజేపీ గెలుచుకుంది. పూర్వాంచల్ ఓటర్లు అంటే పశ్చిమ యూపీ, బిహార్ నుంచి వలస వచ్చిన వారు. ఇటీవల బడ్జెట్ లో పూర్వాంచల్ ప్రాంతానికి భారీగా నిధులు ప్రకటించింది కేంద్రం. ఇది ఆ ప్రాంత ఓటర్లపై ప్రభావం చూపిందని అంటున్నారు. తమ స్వస్థలాల రూపు మాపేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వారు నమ్మారంటున్నారు.
ఇక ప్రధానంగా ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని విశ్లేషిస్తున్నారు. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఈ ఆధిపత్యం దక్కేది కాదంటున్నారు. రెండు పార్టీల ఓటు షేర్ కలిపితే 50 శాతం దాటుతోంది. కానీ, విడివిడిగా పోటీ చేయడం వల్ల చీలిక వచ్చి అంతిమంగా బీజేపీ లాభపడిందని అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చెబుతూ సెటైర్ వేశారు. మిత్రపక్షం కోసం కాంగ్రెస్ తగ్గితే ఇద్దరూ లాభపడేవారని అంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో బీజేపీ విజయానికి ఈ మూడు అంశాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి.