జస్ట్ మూడు శాతమే ... బీజేపీకి రెట్టింపు సీట్లు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. డెబ్బయి అసెంబ్లీ సీట్లలో బీజేపీ మూడింట రెండు వంతులను సాధించి హస్తిన పీఠం అందుకుంటోంది
By: Tupaki Desk | 8 Feb 2025 6:30 PM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. డెబ్బయి అసెంబ్లీ సీట్లలో బీజేపీ మూడింట రెండు వంతులను సాధించి హస్తిన పీఠం అందుకుంటోంది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ తన ఓటు షేరుని పెంచుకుంది. బీజేపీకి 46.69 శాతం ఓటు షేర్ వస్తే ఆప్ కి 43.44 శాతం ఓటు షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కి. 6 శాతం పైగా ఓటు షేర్క్ దక్కితే ఇతరులకు మూడు శాతం ఓటు షేర్ లభించింది.
ఇక చూస్తే బీజేపీకి ఆప్ కి మధ్యన కేవలం మూడు శాతం ఓటు షేర్ తేడా మాత్రమే ఉంది. ఇక కాంగ్రెస్ చూస్తే ఏకంగా ఆరు శాతం పైగా ఓట్లు తీసుకుంది. అంటే కాంగ్రెస్ ఆప్ పొత్తులు పెట్టుకుంటే కచ్చితంగా బీజేపీకి ఇబ్బంది ఏర్పడేది అని అంటున్నారు.
అయితే అవన్నీ ఊహాజనితమైన అంశాలు అని బీజేపీ కొట్టి పారేస్తోంది. ఇక ఆప్ పట్ల వ్యతిరేకత నుందై పదేళ్ళ పాలన తరువాత యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అదే ఫలితాలలో ప్రతిఫలించింది అని అంటున్నారు. కాంగ్రెస్ కనుక ఆప్ తో కలిస్తే ఆ వ్యతిరేకతతో కాంగ్రెస్ ఓటు షేర్ కూడా తగ్గేది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఆప్ ని ఈసారి మధ్యతరగతి తో పాటు చాలా వర్గాలు నెత్తిన పెట్టుకోలేదు. ఆప్ కి అసలైన ఓటు బ్యాంకు మిడిల్ క్లాస్. వారే ఎదురు తిరిగేసరికి ఆప్ నీరు కారింది అని అంటున్నారు. దాంతో ఆప్ ఈసారి చాలా చోట్ల ఓటమి పాలు కావాల్సి వచ్చింది.
మరో వైపు చూస్తే బీజేపీ ఒక పద్ధతి ప్రకారం చేసిన ప్రచారం కూడా కాషాయం పార్టీకి అనుకూలించింది అని చెప్పాలి. బీజేపీ 1993లో గెలిచి 1998లో అధికారం పోగొట్టుకుంది. ఆ తరువాత నుంచి ఇప్పటికి 27 ఏళ్ళ పాటు అధికారం రుచి చూడలేదు. దేశంలో బీజేపీ గెలిచినా ప్రధాన్ సహా కేంద్ర మంత్రులు అంతా ఉండే ఢిల్లీలో మాత్రం పాలన వేరే వారి చేతులలో ఉండేది.
బీజేపీకి ఇది ప్రతిష్టగా మారింది. ఎందుకు గెలవలేకపోతున్నామన్నది ఒక కసిగా మారి ఢిల్లీ పీఠాన్ని ఈసారి బద్ధలు కొట్టాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చింది. ఇక కేజ్రీవాల్ చూస్తే ఆయన పరిపాలన పట్ల కొన్ని వర్గాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు అన్నది ఫలితాలను బట్టి అర్ధం అవుతోంది.
కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ప్రజలు అవకాశం ఇస్తే ఆయన బీజేపీ పెద్దల మీద కేంద్ర ప్రభుత్వంతో జాతీయ స్థాయిలో వివాదాలకు దిగడం పట్ల కూడా జనాలు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు కేంద్రంతో సయోధ్యగా ఉండి అభివృద్ధి చేయాల్సింది వారితో విభేదించి అభివృద్ధి బలి పెట్టారన్న చర్చ కూడా సాగింది.
దాంతో లెఫ్టినెంట్ గవర్నర్ సహకరించడం లేదు అని కేజ్రీవాల్ చెప్పిన మాటలను జనాలు విశ్వసించలేదు అని అంటున్నారు. దాంతో పాటు బీజేపీ ఎటూ కేంద్రంలో ఉంది. ఢిల్లీలో కూడా అదే పార్టీని తెచ్చుకుంటే అభివృద్ధి సాధ్యపడుతుంది కదా అన్న ఆలోచనతోనే ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారని అంటున్నారు. ఢిల్లీలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అన్న బీజేపీ నినాదానికి సగటు ఓటరు ఎట్రాక్ట్ అయ్యారని కూడా అంటున్నారు. అయితే ఇంతటి వ్యతిరేకతలోనూ ఆప్ 43 శాతం ఓటు షేరుని తెచ్చుకోవడం మామూలు విషయం కాదనే అంటున్నారు.