Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్‌.. 'ఎగ్జాక్ట్' పోల్స్‌.. ఎవ‌రు నెగ్గారు?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిఈ నెల 5న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్‌ను వెలువ‌రించాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2025 8:54 AM GMT
ఎగ్జిట్ పోల్స్‌.. ఎగ్జాక్ట్ పోల్స్‌.. ఎవ‌రు నెగ్గారు?
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిఈ నెల 5న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్‌ను వెలువ‌రించాయి. 99 శాతం స‌ర్వే సంస్థ‌లు.. బీజేపీ వైపే మొగ్గు చూపాయి. అయితే.. కేకే స‌హా మ‌రో సంస్థ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మూడో సారి కూడా విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని చెప్పాయి. అయితే.. అస‌లు ఫ‌లితం తాలూకు కౌంటింగ్ జ‌రుగుతున్న క్ర‌మంలో ఎగ్జిల్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయా? అని చూస్తే.. 99 శాతం స‌ర్వే సంస్థ‌లు చెప్పిన విష‌యం వాస్త‌వమైంది.

అయితే.. ఇక్క‌డ కూడా.. కాంగ్రెస్‌కు 1 లేదా 2 స్థానాలు వ‌స్తాయ‌ని అన్ని స‌ర్వేలు చెప్పుకొచ్చాయి. ఈ విషయంలో మాత్రం ఈ సంస్థ‌లు త‌ప్పులో కాలేసిన‌ట్టు ఓట్ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. పీపుల్స్ పల్స్- కొడిమో స‌ర్వే ప్ర‌కారం.. బీజేపీ 51-60, ఆప్‌ 10-19 సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో బీజేపీ 45 సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకుంది. సో.. ఈ లెక్క‌ల ఎక్కువ‌గానే ఉన్నా.. స‌ర్వే సంస్థ అంచ‌నాలు త‌ప్ప‌లేదు.

ఇక‌, చాణక్య స్ట్రాటజీస్ సంస్థ‌ బీజేపీ 39 నుంచి 44 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారం చేప‌ట్టే అవ‌కాశం ఉందని తెలిపింది. ప్ర‌స్తుతం అంచ‌నాను బీజేపీ దాటేసి 46 స్థానాల‌ను కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇక‌, ఆమ్ ఆద్మీ కేవ‌లం 25 నుంచి 28 స్థానాలకే ప‌రిమితం కానుందని చెప్పినా.. ఈ లెక్క కూడా.. 24-25 మ‌ధ్య ఊగిస‌లాడుతోంది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందని ఈ సంస్థ పేర్కొంది. కానీ.. కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. సో.. ఈ స‌ర్వే ఫ‌లితాలు.. బాగానే ఉన్నా.. మిశ్ర‌మంగానే ఉన్నాయ‌ని చెప్పాలి.

ఇక‌, గత ఏడాది ఏపీలో ఎన్నిక‌లకు సంబంధించి స‌ర్వే చేసిన కేకే.. సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఈ స‌ర్వేపైనా అంద‌రి దృష్టీ ఉంది. తాజా ఢిల్లీ ఎన్నిక‌ల్లో కేకే సర్వే ఆమ్ ఆద్మీ.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఢిల్లీ గ‌ద్దెపై కూర్చోనుందని తెలిపింది. ఈ పార్టీకి 39 సీట్ల‌లో విజ‌యం ప‌క్కాఅని, బీజేపీ 22 స్థానాలకు ప‌రిమితం కానుందని తెలిపింది. ఇది పూర్తిగా రివ‌ర్స్ అయి.. కేకే స‌ర్వే ఫెయిల్ అయింది.

ఇక‌, రిపబ్లిక్‌ పిమార్క్ కూడా బీజేపీదే అధికారమ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ పార్టీ 39 నుంచి 49 సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉందని తెలిపింది. ఇప్పుడు దాదాపు 46 స్థానాల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్క‌నున్న నేప‌థ్యంలో ఈ సంస్థ చేసిన స‌ర్వే ఎగ్జాక్ట్ కాక‌పోయినా.. అటు ఇటుగా నిజ‌మైంది. ఇక‌, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 21 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానం ద‌క్కించుకునే చాన్స్ ఉందని చెప్పినా.. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా.. ఆప్ 24-25 స్థానాల‌కే ప‌రిమితం కానుంది.