ఢిల్లీలో ఎందుకిలా.. ఈ విషయాలు తెలుసా?
ఎందుకంటే.. ప్రత్యర్థులు ఎంత పుంజుకున్నా.. 25 వేల ఓట్లను పుంజుకునే అవకాశం లేదు. సో.. దీనిని బట్టి బీజేపీ గెలుపు రాసిపెట్టుకున్నట్టుగానే జరిగింది.
By: Tupaki Desk | 8 Feb 2025 8:54 AM GMTప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైపోయింది. ఆది నుంచి లీడ్‌లో ఉన్న కమలం పార్టీ నాయకులు.. 50 స్థానాలకు మించి.. ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఒక్కొక్క నేత.. సగటున 25 వేల కోట్లకు తక్కువగా కాకుండా.. లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ అంచనాలు మారుతాయేమో.. అనుకునే సందేహాలు కూడా పటాపంచలయ్యాయి. ఎందుకంటే.. ప్రత్యర్థులు ఎంత పుంజుకున్నా.. 25 వేల ఓట్లను పుంజుకునే అవకాశం లేదు. సో.. దీనిని బట్టి బీజేపీ గెలుపు రాసిపెట్టుకున్నట్టుగానే జరిగింది.
అయితే.. ఈ తరహా ఏక పక్ష విజయం ఢిల్లీలో ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆప్ విజయం దక్కించుకుంది. 70 స్థానాల్లో 69 స్థానాలు కూడా ఆప్ వశమయ్యాయి. అయితే.. ఇలా ట్రెండ్స్ రాలేదు. ఇంత ఏకపక్షంగా అయితే లేదు. గెలుపు కొన్నికొన్ని స్థానాలలో 10-100 ఓట్ల తేడాతో సాధించిన నాయకులు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఢిల్లీ ఓటరు మార్పు స్పష్టంగా చూపించారు. దీనికి కారణాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
1) డబుల్ ఇంజన్ సర్కారుకు పెరుగుతున్న ఆదరణ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం (అది కూటమి అయినా) ఉంటే.. అభివృద్ధి జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో బలపడుతోంది. నిజానికి ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా అలానే ఉంది. కేంద్రంలోని బీజేపీని సమర్థించే పార్టీలు ఉన్న రాష్ట్రాలకే నిధులు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై విమర్శలు వున్నా.. చేయగలిగింది ఏమీ లేకపోవడంతో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారుకే మొగ్గు చూపినట్టు స్పష్టమైంది.
2) ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో విశేష అధికారాలు.. ఇక్కడి ప్రభుత్వ పార్టీకి ఉండడం లేదు. దీంతో ప్రతి విషయం కూడా.. వివాదం అవుతోంది. నిధులు రావడం లేదు. ఈ పరిణామాలకు చెక్ పెట్టడం కూడా.. ఢిల్లీ ఓటరు పరిణితికి నిదర్శన మన్న భావన వ్యక్తమవుతోంది. మరో వైపు.. కేంద్ర పాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఎక్కువగా ఉంటోంది. సో... ఇతర పార్టీలను గెలిపించినా.. ప్రయోజనం అంతంత మాత్రమే. ఇది కూడా ఎన్నికలను ప్రభావితం చేసిందన్న చర్చ సాగుతోంది.
3) పథకాలు: రాజకీయాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. పార్టీలు వివిధ తాయిలాలు ప్రకటిస్తున్నాయి. తొలినాళ్లతో తాము తాయిలాలకు వ్యతిరేక మన్న బీజేపీ.. మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కకు మిక్కిలిగా.. తాయిలాలు ప్రకటించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కొనసాగింపు, నెలకు రూ.2500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం.. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు వంటివి ప్రభావం చూపించాయి. పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే.. ప్రజల ఆలోచనా దృక్ఫథం ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు.