Begin typing your search above and press return to search.

ఇక్కడేమో వద్దన్నా వర్షాలు.. అక్కడేమో కృత్రిమ వర్షాలే దిక్కు!

ఒకవైపు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుంటే.. ఇంకోవైపు ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వర్షాలను కురిపించాలని నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 1:30 PM GMT
ఇక్కడేమో వద్దన్నా వర్షాలు.. అక్కడేమో కృత్రిమ వర్షాలే దిక్కు!
X

రెండు తెలుగు రాష్ట్రాలను కుండపోత వానలు, వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వీటి నుంచి కాస్త తెరిపిన పడుతున్నాయి. బొంబాయిలో మాత్రం భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో నలుగురు మరణించారు. భారీ వర్షాల ధాటికి బొంబాయిలో పలు రైళ్లు, విమానాల రాకపోకల సమయాలను సవరించారు.

ఒకవైపు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుంటే.. ఇంకోవైపు ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వర్షాలను కురిపించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరాల్లో ఒకటిగా ఢిల్లీ రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాలపైనే ఢిల్లీ ప్రభుత్వం ఆధారపడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత మేర కాలుష్యం తగ్గింది. అయినప్పటికీ మరికొంత మేర వాయు కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షాలను కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్‌ లో వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆప్‌ ప్రభుత్వంలో మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన వివరించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాలు కురిపించాలని నిర్ణయించామన్నారు.

ఈ క్రమంలో నవంబర్‌ 1 నుంచి 15 వరకు ఢిల్లీలో కృత్రిమ వర్షాలు కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రానున్నది చలికాలం. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని వీలైనంత మేర తగ్గించడానికి 21 పాయింట్లతో ఆప్‌ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

ఇప్పటికే ఢిల్లీలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఢిల్లీ ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే చర్యలను వేగవంతం చేసే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం ఉంది.

కాగా 2016–2023 మధ్య ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గింది. గత నాలుగేళ్లలో దాదాపు రెండు కోట్ల చెట్టు నాటటంతో ఇది సాధ్యమైంది.

మరోవైపు ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలను పరిశీలించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, ఢిల్లీ నగరపాలక సంస్థ, ప్రజా పనుల విభాగాల్లో 86 మంది సభ్యులతో ఒక ప్రత్యేక టాస్కుఫోర్స్‌ ను కూడా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.