Begin typing your search above and press return to search.

రూ.3,500 కోట్ల పన్ను వ్యవహారం.. కాంగ్రెస్‌ కు ముప్పు తప్పినట్టేనా?

కేంద్ర సంస్థలు.. ఈడీ, సీబీఐ, ఐటీ తదితరాలను జేబు సంస్థలుగా వాడుకుని ప్రతిపక్షాలను వేధిస్తోందని ధ్వజమెత్తారు.

By:  Tupaki Desk   |   1 April 2024 1:30 PM GMT
రూ.3,500 కోట్ల పన్ను వ్యవహారం.. కాంగ్రెస్‌ కు ముప్పు తప్పినట్టేనా?
X

దేశంలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ కు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల ముంగిట తమను దెబ్బతీయడమే లక్ష్యంగా తమ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐటీ శాఖతో జప్తు చేయించిందని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.

ఎన్నికల ప్రచారానికి నేతలను పంపడానికి విమాన టికెట్లు బుక్‌ చేయడానికి, చివరకు రైలు టికెట్లు బుక్‌ చేయడానికి కూడా తమ వద్ద డబ్బుల్లేవని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే నిర్వేదం వ్యక్తం చేశారు. రూ.2 కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. దీనికంతటికీ కారణం మోదీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. కేంద్ర సంస్థలు.. ఈడీ, సీబీఐ, ఐటీ తదితరాలను జేబు సంస్థలుగా వాడుకుని ప్రతిపక్షాలను వేధిస్తోందని ధ్వజమెత్తారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 2022–23కి గానూ రూ.135 కోట్లు ఆదాయపన్ను కట్టాల్సి ఉందని.. కట్టకపోవడం వల్లే ఆ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాన్ని స్తంభింపజేశామని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా ఊరట దక్కలేదు. న్యాయమూర్తి కాంగ్రెస్‌ పిటిషన్‌ ను తోసిపుచ్చడంతో డివిజన్‌ బెంచ్‌ కు అప్పీలు చేసి పునఃపరిశీలన చేయాలని ఆ పార్టీ కోరింది. అయినప్పటికీ ఊరట దక్కలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, కాంగ్రెస్‌ పార్టీ పన్ను చెల్లించాల్సి ఉందని ఐటీ శాఖ చెబుతోందని కోర్టు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ వేసిన పిటిషన్‌ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన వెంటనే ఆదాయ పన్ను శాఖ ఆ పార్టీపై కొరడా ఝులిపించింది. 2017–18, 2020–21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు పంపింది. ఇవి చాలవన్నట్టు 2014–15 నుంచి 2016–17 మదింపు సంవత్సరాలకు గానూ మరో రూ.1744 కోట్లు కట్టాలని ఇంకో నోటీసు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం రూ.3,567 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఐటీ నోటీసులపై కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చిన సందర్భంగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున కాంగ్రెస్‌ పార్టీ పై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని కోర్టుకు ఐటీ శాఖ నివేదించింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పు ఇచ్చే వరకు ముందస్తు చర్యలు చేపట్టమని హామీ ఇచ్చారు. దీంతో కోర్టు విచారణను జులై 24కి వాయిదా వేసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఊరట దక్కినట్టయింది.