Begin typing your search above and press return to search.

చాట్‌ జీపీటీపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో చాట్‌ జీపీటీపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక విచారణ సందర్భంగా ఈ మేరకు కోర్టు స్పందించింది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 6:39 AM GMT
చాట్‌ జీపీటీపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
X

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారిన అంశం.. చాట జీపీటీ. ఈ టూల్‌ ను ఉపయోగించి ఏ ప్రశ్న అడిగినా ఇందుకు సంబంధించి వెంటనే టెరా బైట్ల సమాచారం వచ్చేస్తుంది. దీనివల్ల ప్రయోజనాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నేరస్తులు తాము నేరాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు దీని ద్వారా తెలుసుకుంటారని, అలాగే సైబర్‌ మోసాలు చేయడం, తప్పించుకోవడం ఇలా పలు రకాల ఘోరాలకు చాట్‌ జీపీటీ ఉపయోగపడుతుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో చాట్‌ జీపీటీపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక విచారణ సందర్భంగా ఈ మేరకు కోర్టు స్పందించింది. మనిషి తెలివితేటలకు, న్యాయ నిర్ణయ ప్రక్రియలో మానవ జోక్యానికి కృత్రిమ మేధస్సు ప్రత్యామ్నాయం కాబోదని స్పష్టం చేసింది. ఓ తీర్పు వెలువరించడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌ జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని నొక్కివక్కాణించింది. ఇలాంటి చాట్‌ బోట్‌ల కచ్చితత్వం, వాటిపై ఎంతవరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉందని ఢిల్లీ హైకోర్టు గుర్తు చేసింది.

ప్రస్తుతం ప్రాథమిక పరిశోధన, అవగాహన కోసం మాత్రమే చాట్‌ జీపీటీని ఉపయోగించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు వ్యాపార చిహ్న నిబంధనలను తమ భాగస్వామ్య సంస్థ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. విలాసవంతమైన చెప్పులు, బూట్లు తయారుచేసే 'క్రిస్చన్‌ లూబటన్‌' దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ తీర్పు వెలువరించారు.

తమ నమోదిత వ్యాపార చిహ్నంపై, దాని ప్రతిష్ఠపై చాట్‌ జీపీటీ ఏం చెబుతోందో చూడాలని సంస్థ తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రశ్న ఏ తీరులో ఉందనే దానిని బట్టి, దానికి అందిన శిక్షణ ఆధారంగా చాట్‌ బోట్‌లు సమాధానాలు ఇస్తుంటాయని కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అవి తప్పు అయ్యే అవకాశాలూ లేకపోలేదని పేర్కొంది.

ఉద్దేశ పూర్వకంగానే ప్రతివాది.. పిటిషనర్‌ ఉత్పత్తులను కాపీ కొట్టారని, ఆ బ్రాండ్‌ పేరును వాడుకొని డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ బూట్ల డిజైన్లను, రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ చేయరాదని ప్రతివాదికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు పిటిషనర్‌ తో ఒప్పందం చేసుకోవాలని సూచించింది. దానిని అతిక్రమిస్తే రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం పిటిషన్‌ ఖర్చుల కింద ఫిర్యాదిదారుకు రూ.2 లక్షలు చెల్లించాలని ప్రతివాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం సర్వరోగాలకు జిందా తిలిస్మాత్‌ ఒక్కటే మందు అన్నట్టు వివిధ అంశాలకు సంబంధించి తమకు సమాచారం కావాలంటే చాట్‌ జీపీటీ పైనే చాలా మంది ఆధారపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ అసైన్‌ మెంట్లు, ప్రాజెక్టు వర్కులు, థీసిస్‌ లకు సంబంధించి చాట్‌ జీపీటీపైనే దృష్టి సారిస్తున్నారు. తద్వారా సొంతం చేయాల్సిన పనులను చాట్‌ జీపీటీ ద్వారా అడ్డదారుల్లో చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.