సీఎంగా కేజ్రీవాల్ కొనసాగడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
కాగా తాజాగా ఢిల్లీ హైకోర్టు ఓ కీలక అంశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరటనిచ్చింది. జైల్లో ఉన్న ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు తోసిపుచ్చింది.
By: Tupaki Desk | 4 April 2024 9:20 AM GMTఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఏప్రిల్ 15 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం విదితమే, దీంతో కేజ్రీవాల్ ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.
కాగా తాజాగా ఢిల్లీ హైకోర్టు ఓ కీలక అంశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరటనిచ్చింది. జైల్లో ఉన్న ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించడానికి అంగీకరించలేదు. ఈ మేరకు హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన ధర్మాసనం రద్దు చేసింది.
ముఖ్యమంత్రిగా కొనసాగాలో, వద్దో అనేది పూర్తిగా కేజ్రీవాల్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోదని తేల్చిచెప్పింది. దీంతో కేజ్రీవాల్ కు అతిపెద్ద ఊరట లభించినట్టయింది. కేజ్రీవాల్ జైలులో ఉండి పాలనాపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలా, వద్దా అనేదానిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం పనిచేయట్లేదని తామెలా తేలుస్తామని కోర్టు ప్రశ్నించింది.
లెఫ్టినెంట్ గవర్నర్ ఈ విషయాన్ని చూసుకోవాలంది. ఆయనకు మార్గదర్శకత్వం కానీ, సలహాలు, సూచనలు కానీ ఇచ్చే అవసరం తమకు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. చట్టప్రకారమే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది.
కాగా కేజ్రీవాల్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇంతకు ముందు దాఖలైన పిటిషన్ ను కూడా కోర్టు రద్దు చేసింది.