Begin typing your search above and press return to search.

భర్తను హింసిస్తున్న భార్యకు చెక్ పెట్టిన ఆ హైకోర్టు

విచారణకు నో చెప్పారు. దీనికి సంబంధించిన తీర్పును వెలువరించిన హైకోర్టు కాస్తంత ఘాటుగా స్పందించింది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 4:21 AM GMT
భర్తను హింసిస్తున్న భార్యకు చెక్ పెట్టిన ఆ హైకోర్టు
X

భార్యల్ని హింసించే భర్తల గురించి తెలిసిందే. అలాంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం రోటీన్ కు కాస్తంత భిన్నం. భర్తపై అదే పనిగా కేసులు పెట్టి.. మానసిక ప్రశాంతత లేకుండా చేయటం.. సరికొత్త ఆరోపణల్ని సంధించటం.. విడాకుల్ని కోర్టు మంజూరు చేసిన తర్వాత కూడా క్రిమినల్ ఛార్జెస్ కోసం కోర్టును ఆశ్రయించే ఒక భార్య తీరును ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. ఆసక్తికరంగా మారిన ఈ కేసు ఉదంతంలోకి వెళితే..

ఢిల్లీకి చెందిన ఒక జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీనిపై భార్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విడాకులకు తాను సుముఖంగా లేనని పేర్కొంటూ ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. తన భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నారని.. అతన్ని తాను వేధిస్తున్నట్లుగా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వాదించింది. ఈ కారణంగా ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల్ని రద్దు చేయాలని కోరింది.

ఈ కేసుపై విచారణ చేపట్టింది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైటీ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం. భార్య పిటిషిన్ ను రిజెక్టు చేశారు. విచారణకు నో చెప్పారు. దీనికి సంబంధించిన తీర్పును వెలువరించిన హైకోర్టు కాస్తంత ఘాటుగా స్పందించింది. సుదీర్ఘకాలం దంపతులు వేర్వేరుగా ఉండి.. విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు భర్త మరో మహిళతో కలిసి ఉన్నందున విడాకులు రద్దు చేయాలన్న భార్య వాదనలో అర్థం లేదని పేర్కొంది.

అత్తింటి వారి విషయంలోనూ.. భర్తపైనా సదరు భార్య అమర్యాదగా ప్రవర్తించిందన్న విషయాన్ని ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు.. 'తరచూ క్రిమినల్ ఆరోపణలతో కట్టుకున్న వాడికి మనశ్శాంతి లేకుండా చేయటమా? భార్య వైఖరితోనే భర్త మరొక మహిళ సాంగత్యంలో ఊరట పొంది ఉండొచ్చు. విడాకుల కేసు దాఖలైన తర్వాత జరిగిన విషయం కాబట్టి.. ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేయాల్సిన పని లేదు. భార్య క్రూర ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని బాధిత భర్తకు విడాకులు మంజూరు చేయటం సమంజసమే. ఈ కేసులో భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లుగా నిరూపించే సాక్ష్యాధారాలు కూడా లేవు'' అని ధర్మాసనం పేర్కొంది.

వైవాహిక బంధానికి ఏళ్ల తరబడి దూరంగా ఉండటం.. భార్యతో మళ్లీ కలిసే అవకాశం లేకపోవటంతో మరో మహిళ సాంగత్యంలో అతడు మనశ్శాంతి పొంది ఉండొచ్చన్న కోర్టు.. వేరే మహిళతో కలిసి ఉన్నది విడాకుల పిటిషన్ పెండింగ్ ఉన్న తర్వాత జరిగిన సంఘటనంటూ ప్రస్తావించింది. భార్య క్రూరత్వం రుజువైన కారణంగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయటం సబబే అంటూ కోర్టు తేల్చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.