భర్తపై తప్పుడు ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్!
భర్త.. అతని కుటుంబాన్ని కష్టాలుపాలు చేసేందుకు డిసైడ్ అయిన భార్య కేసుల పరంపరతో చుక్కలు చూపించటం షురూ చేసింది
By: Tupaki Desk | 24 Aug 2023 4:57 AM GMTఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. భర్తల మీద తప్పుడు ఆరోపణలు చేసే భార్యలకు చెంపపాటు లాంటి చర్యల్ని తీసుకుంది. అంతేకాదు.. అలాంటి వారి తప్పుల్ని ఎండగట్టేసేలా వ్యవహరించింది. భర్తతో సరిపోక విడిగా ఉంటున్న మహిళ.. కసిగా వ్యవహరించిన తీరును తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు తాజా నిర్ణయం.. కొందరు భార్యలు చేసే హింసకు రిలీఫ్ గా మారింది. అసలేం జరిగిందంటే..
భర్త.. అతని కుటుంబాన్ని కష్టాలుపాలు చేసేందుకు డిసైడ్ అయిన భార్య కేసుల పరంపరతో చుక్కలుచూపించటం షురూ చేసింది. కొన్నేళ్లుగా తనకు దూరంగా ఉంటున్న భర్తపై తప్పుడు ఆరోపణలు చేసి కేసు బుక్ చేయించిందీ భార్యామణి. తనపై తన భర్త.. అతని కుటుంబ సభ్యులు క్రూరంగా వ్యవహరించారన్న ఆరోపణలు మాత్రమే కాదు.. ఒకసారి తన అత్త ఎదుట మామ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది.
ఇదిలా ఉంటే.. తన భార్య నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని మహాప్రభూ అంటూ కోర్టుకు ఎక్కాడా భర్త. అయితే.. కుటుంబ కోర్టు మాత్రం విడాకులు ఇచ్చేందుకు ససేమిరా అంది. దీంతో.. బాధితుడు ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. ఈ కేసును స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా తీర్పు ఇచ్చిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి.. అతన్ని స్టేషన్ కు పిలిపిస్తూ ఇబ్బందులకు గురి చేసే తీరును హింసకు ప్రతిరూపమని వ్యాఖ్యానించింది హైకోర్టు.
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ కేసుపై తీర్పును ఇస్తూ.. దంపతులు ఇద్దరు సుమారుగా పదిహేడేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారని.. సుదీర్ఘ కాలంగా వేరుగా ఉండటాన్ని విడాకుల మంజూరుకు ఆధారంగా పరిగణించొచ్చన్న సుప్రీం కోర్టు ఆదేశాల్ని గుర్తు చేస్తూ విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో.. భర్తను మానసికంగా వేధింపులకు గురి చేయటం హింసకు మూల కేంద్రంగా పేర్కొంటూ.. తప్పుడు ఆరోపణలు చేస్తూ భర్తల్ని ఇబ్బందులకు గురి చేయటాన్ని తప్పు పట్టింది. ఈ కోర్టు తీర్పు.. తప్పుడు ఆరోపణలు చేసే బార్యలకు షాకిచ్చే కేసుగా చెబుతున్నారు.