Begin typing your search above and press return to search.

కవిత నెలాఖరు వరకు తిహాడ్ జైల్లోనే మళ్లీ నిరాశ

ఆగస్టు 8 వరకు కస్టడీ పొడిగింపును బట్టి చూస్తే ఆమె అప్పటివరకు బయటకు రానట్లేనని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 July 2024 8:26 AM GMT
కవిత నెలాఖరు వరకు తిహాడ్ జైల్లోనే మళ్లీ నిరాశ
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 16న అరెస్టయిన ఆమె ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నారు. ఇదే కేసులో బెయిల్ కోరుతూ ఆమె చేసుకున్న పిటిషన్లు పదేపదే తిరస్కరణకు గురవుతున్నాయి. తాజాగా జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 31 వరకు కోర్టు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇచ్చిన తీర్పు. అయితే, సీబీఐ దాఖలు చేసిన కేసులో గురువారం రాత్రి న్యాయమూర్తి కావేరీ బవేజా ఆగస్టు 8 వరకు కవిత రిమాండ్ ను పొడిగించారు. తిహాడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు నిందితులను కోర్టు ఎదుట హాజరుపరిచారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలనూ ఇలానే కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరి జ్యుడీషియల్‌ కస్టడీని సైతం ఈ నెల 31 వరకు కోర్టు పొడిగించింది.

బయటకు వచ్చేదెప్పుడు?

ఎమ్మెల్సీ కవిత మార్చి 16న అరెస్టయ్యారు. అంటే ఇప్పటికే నాలుగు నెలలు దాటిపోయింది. ఆగస్టు 8 వరకు కస్టడీ పొడిగింపును బట్టి చూస్తే ఆమె అప్పటివరకు బయటకు రానట్లేనని తెలుస్తోంది. మరోవైపు ఈడీ, సీబీఐ వద్ద ఉన్న సాక్ష్యాలు బలంగా ఉండడమే కవిత బెయిల్ పిటిషన్ల తిరస్కరణకు కారణంగా భావిస్తున్నారు. వాస్తవానికి కవిత తీవ్రమైన అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ కోరుతున్నారు. అయినప్పటికీ బెయిల్ రాకపోవడం గమనార్హం. కాగా, సీబీఐ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కవిత వేసిన పిటిషన్ పై ఈ నెల 22న రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. కవితపై సీబీఐ వేసిన ఛార్జిషీట్‌ ను కోర్టు పరిగణనలోకి తీసుకుని శుక్రవారం (జూలై 26) కవితను వర్చువల్‌గా హాజరుపర్చాలని సీబీఐని ఆదేశించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్‌ 7న సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

తీవ్రస్థాయి ఆరోపణలతో..

కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో కీలక అంశాలను ప్రస్తావించింది. వ్యాపారులకు అనుకూలంగా మద్యం విధానం రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవితనే అని పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత సూత్రధారి అని వాదిస్తోంది. ఈ క్రమంలో కవితకు బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ సాయం చేశారని చెబుతోంది. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన సొమ్మును హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సీబీఐ ఇప్పటికే ఆరోపించింది. సీబీఐ కవితను ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తిహాడ్ జైలులో ఉన్నారు. ఈ నెల 1న ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.