లిక్కర్ స్కాం లొంగుబాట్లన్నీ.. ఆప్ ను ఇరికించేందుకే?
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నుంచి ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపించిన పేర్లెన్నో
By: Tupaki Desk | 9 Sep 2023 11:30 PM GMTతెలుగు రాజకీయాల్లో మొన్నటివరకు ఢిల్లీ లిక్కర్ స్కాం ఓ పెద్ద సంచలనం. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉన్న వ్యక్తుల పాత్ర ఉండడం.. ఈడీ, సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు చేయడంతో పెను దుమారం రేగింది. తమను అణచివేసేందుకే మోదీ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తోందని.. అసలక్కడ స్కామే లేదని ప్రతిపక్షాలు వాపోయాయి. కానీ, ఎవరి పని వారిదే అన్నట్లు దర్యాప్తు సంస్థలు ముందుకెళ్లాయి.
ఎమ్మెల్సీ కవిత నుంచి ఎంపీ మాగుంట వరకు
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నుంచి ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపించిన పేర్లెన్నో. సౌత్ గ్రూప్ లో మాగుంటకు చెందిన ఇండో స్పిరిట్ కంపెనీది కీలక పాత్ర. ఇక ఈ కేసులో ఎంపీ కుమారుడు రాఘవ్ రెడ్డి సైతం ఉన్నారు. వీరేకాక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థలకు చెందిన శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. కాగా, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. తాజాగా ఎంపీ శ్రీనివాసుల రెడ్డి కూడా అప్రూవర్ అయ్యారు.
మాగుంట రూ.100 కోట్ల మూట విప్పుతారా?
ఎంపీ శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారిన నేపథ్యంలో ఆయన ''హైదరాబాద్ నుంచి రూ.100 కోట్ల ముడుపుల'' ఢిల్లీకి చేరిన వైనంపై నోరిప్పుతారా? అనే ప్రశ్న వస్తోంది. కాగా, సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లను ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నాయకుకు అందించి మద్యం విధానాన్ని అనుకూలంగా తయారు చేసుకున్నట్లు సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో పేర్కొన్నాయి. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన శరత్ చంద్రారెడ్డి, రాఘవ్‌లను ఈడీ అరెస్టు చేసింది. వీరు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా కూడా మారారు.
ఇప్పుడు ఇదే కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది. సౌత్‌గ్రూప్ నుంచి ఆప్ నేతలకు ముడుపులు ముట్టజెప్పిన విధానానికి సంబంధించిన వివరాలను ఈడీకి అందించడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో ఇంతవరకూ మాగుంట శ్రీనివాసులురెడ్డి అరెస్టు కాకపోయినా ఆయన ముందుజాగ్రత్తగా అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది. దీంతో మున్ముందు ఎవరెవరి పేర్లు బయటికొస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.
ఆప్ ను ఇరికించేందుకే?
ఢిల్లీలో తమకు కంటగింపుగా మారిన ఆప్ ను ఇరికించేందుకు మోదీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయితే, ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో వరుసగా వ్యక్తులు అప్రూవర్ గా మారుతున్న తీరు చూస్తుంటే కేంద్రం వెనుకనుంచి ఏదో డ్రామా నడుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్ నేతలను మద్యం కేసులో గట్టిగా ఇరికించేలా పరిణామాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. మనీశ్ సిసోదియాను అరెస్టు చేయడం ద్వారా ఓ విధంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని మాత్రమే ఇప్పటివరకు ఈ కేసులో ఇబ్బందిపెట్టగలిగింది. ఇకపై పార్టీ పరంగానూ దెబ్బకొట్టాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోందని చెబుతున్నారు.