Begin typing your search above and press return to search.

ఢిల్లీలో మళ్లీ "సరి-బేసి" విధానం... స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులంటే...?

శీతాకాలం వచ్చిందంటే చాలు దేశరాజధానిలో వాయుకాలుష్యం కోరలు చాస్తుంది. వాయు నాణ్యత సూచీలు ఆందోళన కలిగిస్తుంటాయి

By:  Tupaki Desk   |   6 Nov 2023 1:11 PM GMT
ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం... స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులంటే...?
X

శీతాకాలం వచ్చిందంటే చాలు దేశరాజధానిలో వాయుకాలుష్యం కోరలు చాస్తుంది. వాయు నాణ్యత సూచీలు ఆందోళన కలిగిస్తుంటాయి. కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగిపోయిందని వాయు నాణ్యత సూచీలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచీలు రోజు రోజుకీ దారుణంగా క్షీణిస్తు ఉన్నాయి. ఇలా ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరగడంతో దేశ రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలుష్య నియంత్రణకు ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీపావళి తర్వాతి రోజు నుంచి మళ్లీ "సరి-బేసి" విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు.

ఇదే సమయంలో... నవంబరు 13 (సోమవారం) నుంచి 20వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఇదే సమయంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలోనూ కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలోనే "సరి-బేసి"పై నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అటు స్కూళ్లను కూడా మూసివేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 10, 12వ తరగతుల వారికి మినహా అన్ని స్కూళ్లకు నవంబరు 11 వరకు సెలవులు ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ప్రైమరీ స్కూళ్స్ కి మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు హైస్కూళ్లను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక మరిముఖ్యంగా నిర్మాణ కార్యక్రమాలపై పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రహదారులు, వంతెనల వంటి ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణ పనులను కూడా ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో బీఎస్‌3 పెట్రోల్‌, బీఎస్‌4 డీజిల్‌ వాహనాలపైనా నిషేధం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా... అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఎల్‌.ఎన్‌.జీ, సీ.ఎన్‌.జీ ట్రక్కులను మాత్రమే దేశరాజధానిలోకి అనుమతించనున్నట్లు తెలిపారు.

కాగా... ఢిల్లీ - ఎన్సీఆర్ గాలి నాణ్యత గత శుక్రవారం నాటికి మరింత దిగజారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) చాలా చోట్ల భయంకరమైన స్థాయికి చేరుకోవడంతో 500 స్కేల్‌ పై "400" డేంజర్ మార్క్‌ ను అధిగమించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. హస్తినలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలను "తీవ్ర" విభాగంలో 400 మార్కు కంటే ఎక్కువగా నమోదు చేసిన సంగతి తెలిసిందే.