Begin typing your search above and press return to search.

కేజ్రీ వర్సెస్ మోదీ.. హస్తిన నాడి ఏమిటో? 6వ విడత పోలింగ్ రేపు

దేశంలో మోదీని పదేళ్లుగా నికరంగా ఎదిరిస్తున్న నాయకుడు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్.

By:  Tupaki Desk   |   24 May 2024 2:30 PM GMT
కేజ్రీ వర్సెస్ మోదీ.. హస్తిన నాడి ఏమిటో? 6వ విడత పోలింగ్ రేపు
X

దేశంలో మోదీని పదేళ్లుగా నికరంగా ఎదిరిస్తున్న నాయకుడు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. రాజధాని ఢిల్లీలో ఉంటూ కంట్లో నలుసుగా మారారు కేజ్రీ. ఇన్నేళ్లలో ఆయనను రాజకీయంగా అనేక ఇబ్బందులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. మద్యం విధానం కుంభకోణంలో జైలు పాల్జేసింది. చివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీ బెయిల్ పై రావాల్సి వచ్చింది. అలాంటి ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడింది.

రాజధాని నీదా..నాదా?

ఆరో విడత ఎన్నికల పోలింగ్ శనివారం జరగనుంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో 58 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంతేగాక ఒడిసాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక 58 ఎంపీ సీట్లకు గాను 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. ఇందులో ఏడు ఢిల్లీలోనే ఉన్నాయి. హర్యానా, బిహార్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, యూపీ, బెంగాల్ లో మిగతా సీట్లున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు వేయనున్నారు. 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.

ఈ దశతో 486 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఐదు విడతల్లో 25 రాష్ట్రాల్లోని 428 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. కాగా, ఢిల్లీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 47 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదు కానుంది. హీట్ వేవ్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

రాజధాని ఏమని తీర్పునిస్తుందో??

ఢిల్లీలో 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, అప్పట్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేశాయి. ఈసారి మాత్రం పొత్తు పెట్టుకుని ఆప్ 4, కాంగ్రెస్ 3 సీట్లలో బరిలో దిగాయి. బీజేపీ టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ సహా నాలుగు చోట్ల సిటింగ్ లను మార్చింది. కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కూతురు బంసూరి స్వరాజ్ ను తొలిసారి బరిలో దింపింది. ఇక ఆప్ తమ సీఎం కేజ్రీని బీజేపీ వేధిస్తోందంటూ తీవ్రంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ తో చాలాచోట్ల సమస్యలు తలెత్తినా సమన్వయం చేసుకుంది. ఈ రెండు పార్టీలు బీజేపీని ఎలా నిలువరిస్తాయో చూడాలి.