Begin typing your search above and press return to search.

ఢిల్లీలో రాష్ట్రపతిపాలన...!?

అన్యాయంగా ఆయనను జైలులో పెట్టారని అంటున్నారు. తొందరలోనే కేజ్రీవాల్ జైలు నుంచి వస్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 March 2024 1:30 AM GMT
ఢిల్లీలో రాష్ట్రపతిపాలన...!?
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నాయి. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. తాను చేయను అని అంటున్నారు. ఆప్ మంత్రులు కూడా అదే చెబుతున్నారు. తమ నాయకుడు జైలు నుంచి పాలిస్తారు అని వారు అంటున్నారు. అన్యాయంగా ఆయనను జైలులో పెట్టారని అంటున్నారు. తొందరలోనే కేజ్రీవాల్ జైలు నుంచి వస్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రోజురోజుకు కేజ్రీవాల్ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆయన జైలులో మరిన్నాళ్ళు గడపాల్సి ఉండేలా ఉంది. ఆయనకు ముందు డిప్యూటీ సీఎం గా ఉన్న మనీష్ సిసోడియా అరెస్ట్ అయి ఏడాదిగా జైలు లో ఉన్నారు. దానిని బట్టి చూస్తే కేజ్రీవాల్ ఎన్నాళ్ళు జైలు జీవితం గడుపుతారో అన్న చర్చ ఉంది.

ఈ నేపధ్యంలో కేంద్రం మరో స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఈ రోజుకు చూస్తే ఢిల్లీలో పాలన అయితే స్థంభించింది అని అంటున్నారు. సీఎం జైలు లో ఉన్నారు. కొత్త నేతను ఎన్నుకోలేదు. ఒక విధంగా రాజ్యాంగ ప్రతిష్టంబన ఏర్పడింది అని అంటున్నారు.

దీంతో ఈ కారణం చూపించి రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు అని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జైలు నుంచి పాలన ఉండదని వ్యాఖ్యానించారు. ఇది అతి పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యల వెనక రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశ్యం ఉందని ఆప్ మంత్రులు అంటున్నారు.

దాంతో వారంతా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వాఖ్యలను తప్పుపడుతున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి అన్నారు. ఆమె పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎవరైనా దోషిగా తేలితేనే అలాంటి చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించే విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ఉందని గుర్తు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగ నిబంధనను ఉదహరిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో చట్టం చాలా స్పష్టంగా ఉందన్నారు.

అలాంటప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను ఎలా విధిస్తారు అని కూడా ఆమె ప్రశ్నించారు. పాలనకు అవకాశాలు లేని సందర్భంలోనే రాష్ట్రపతి పాలన విధించవచ్చని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందన్నారు. ఇక తమకు ఢిల్లీ శాసన సభలో పూర్తి మెజారిటీ ఉన్న సమయంలోనూ రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రతీకార చర్య అవుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 356 అంశం సుప్రీంకోర్టుకు పలుమార్లు వెళ్లిందని ఎన్నోసార్లు వ్యతిరేక తీర్పులు వచ్చాయని ఆమె గుర్తు చేస్తున్నారు.

ఇక ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేసినా లేక రాష్ట్రపతి పాలన విధించినా అది రాజకీయ ప్రతీకారం గానే ఉంటుందని ఆమె పేర్కొంటున్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇదో ఫార్ములా అని ఆరోపించారు. ఇలా ఆప్ మంత్రి అతిషి గట్టిగా మాట్లాడుతున్నా ఢిల్లీలో ఈ రోజుకీ ప్రభుత్వ నేత లేరనే అంటున్నారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ నిర్దోషి అని తేలాలంటే న్యాయ ప్రక్రియ చాలానే జరగాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ లోగా ఆయన బెయిల్ మీద బయటకు వస్తే సరేసరి. మరిన్నాళ్ళు జైలులో ఉంటే మాత్రం రాష్ట్రపతి పాలనకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రం ఢిల్లీ రాజకీయాలలో కాక రేపుతోంది. ఆయన లేకుండానే ఎన్నికలు ముగుస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.