హైదరాబాద్ లో వాన పడితే.. ఢిల్లీలో మాత్రం ఈ కారణానికి స్కూళ్లు బంద్!
మిగిలిన సందర్భాల్లో హైదరాబాద్ కు సంబంధించి బోలెడన్ని గొప్పులు చెబుతుంటుంది కేసీఆర్ సర్కారు
By: Tupaki Desk | 3 Nov 2023 4:26 AM GMTమిగిలిన సందర్భాల్లో హైదరాబాద్ కు సంబంధించి బోలెడన్ని గొప్పులు చెబుతుంటుంది కేసీఆర్ సర్కారు. అయితే.. ఇలాంటి మాటలన్ని కూడా చినుకు పడితే చిత్తడి అయ్యే హైదరాబాద్ మాదిరే.. వర్షం ధాటికి గులాబీ పార్టీ నేతలు చెప్పే గొప్పలన్ని చెల్లాచెదురవుతుంటాయి. వర్షానికి చిత్తడి కావటమే కాదు.. స్కూళ్లు.. ఆఫీసులకు సైతం సెలవులు ఇచ్చేసి.. ఇంట్లో నుంచి అవసరమైతే తప్పించి.. బయటకు రావొద్దన్న హెచ్చరికలు జారీ చేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది. వర్షం పడుతుందంటే చాలు.. హైదరాబాద్ మహానగరం వణికిపోవటం చూస్తే.. వ్యవస్థలు ఏ తీరుతో పని చేస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లను బంద్ పెట్టిన వైనం తెలిసిందే. అంతేకాదు.. మహానగర వ్యాప్తంగా నిర్మాణ పనులపైనా బ్యాన్ కొరడాను విధించారు. ఎందుకిలా? కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..దేశ రాజధానిని వాయు కాలుష్యం వణికిస్తోంది. అసలే శీతాకాలం.. చలిగాలులు ఓపక్క.. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో.. అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేవారు.
ఢిల్లీ వ్యాప్తంగా స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.దీనికి సంబంధించిన ఉత్తర్వాలు జారీ అయ్యాయి. వాయు కాలుష్యం కారణంగానే స్కూళ్లకు సెలువులు ఇచ్చామని.. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కాదు.. ప్రైవేటు స్కూళ్లకు సైతం ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు.. వాయు కాలుష్యం తీవ్రం కావటంతో రాజధాని ప్రాంతంలో చేపట్టిన నిర్మాణ పనులపైనా నిషేధ కొరడాను విదిల్చింది.
ప్రభుత్వ ప్రాజెక్టులు.. మైనింగ్.. స్టోన్ క్రషింగ్ మినహా అన్ని నిర్మాణ.. కూల్చివేతల పనులపైనా పరిమితులు విధిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. తేకాదు.. డీజిల్ వాహనాలపైనా పరిమితులు వర్తిస్తాయి. దేశ రాజధానికి సంబంధించి పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్సు 400 పాయింట్లు దాటేసింది. రానున్న మూడు రోజులు ఇలాంటి పరిస్థితే ఉండనుంది. దీంతో.. దేశ రాజధాని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. కాలుష్యంతో ప్రజలు ఆస్తమాతో పాటు.. ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం చూస్తే.. వాయు నాణ్యత సూచి ప్రకారం.. 301-400 వరకు చాలా పేలవమైనదిగా.. 401-500 తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని అత్యధిక ప్రాంతాలు 400 మార్కు దాటేసి ఉండటం గమనార్హం.