దామాషా పద్ధతిలో ఎంపీ సీట్లు పెంచడమే మార్గం !
దేశం అంతా ఒక్కటిగా సమన్యాయం అమలు చేయాలీ అంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలకమైన విషయాలలో సరైన సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
By: Tupaki Desk | 23 March 2025 11:44 PM ISTదేశం అంతా ఒక్కటిగా సమన్యాయం అమలు చేయాలీ అంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలకమైన విషయాలలో సరైన సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
ఇవన్నీ భారతమాత ఒడిలో ఉన్నాయి. ఈ దేశం నాదేశం అని ఆసేతు హిమాచలం అనుకుంటోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ అంతా ఒక్కటిగా నివసిస్తున్నారు. భారత దేశం అన్నది ఈ ప్రపంచంలోనే విశిష్టమైనది. భిన్న జాతులు, భిన్న మతాలు భిన్న సంస్కృతులు కలబోసినది ఈ దేశం.
ఈ దేశంలోని అందరూ ఒక్కటిగా దారాన్ని అల్లుకున్న వివిధ రంగుల పూలు మాదిరిగా కలసి ఉంటున్నారు. ఈ సమాహారం అన్నది ఎంతో అందమైనది. మనకే ఉంది. దానిని చూసి గర్వించాలి. ఈ భిన్నత్వం చూసుకుని ఉప్పొంగాలి. అయితే రాజకీయాల కోసమో వేరే ప్రయోజనాల కోసమో లేక ఉదాశీనంగానో మరే ఇతర కారణంగానో వివక్ష అన్న అనుమానాలు అయితే ఏ ఒక్కరిలోనూ రానీయకూడదు.
ఇప్పటికి ఎనభై ఏళ్ళ క్రితం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటిదాకా తెల్ల దొరలతో పోరాడిన అంతా కలసి ఒక్కటిగా ఉండాల్సిన వేళ పాకిస్తాన్ డిమాండ్ తెచ్చి ప్రత్యేక దేశం కోరుకున్నారు. ఈ దేశంలో తమకు న్యాయం జరగదు అన్న ఒకే ఒక కారణాన్ని చూపించి అఖండ భారతాన్ని విడగొట్టారు. దాని వల్ల సరిహద్దులలో ఈ రోజుకీ మంటలు చెలరేగుతున్నాయి.
భారత దేశం గత ఎనిమిది దశాబ్దాలలో రక్షణ రంగానికి పెట్టిన ఖర్చు కూడా అధికంగా మారడానికి ఇదే కారణం. అలాగే దాయాది పోరులో ఉగ్ర ముప్పు వల్ల దేశం అపారంగా నష్టపోయింది. ఇవన్నీ చరిత్రలో పదిలంగా ఉన్నాయి. ఇక ఈ దేశాన్ని అఖండంగా ఏనాటికైనా ఉంచాలన్నది ఆరెస్సెస్ విధానంగా ఉంది. ఆరెస్సెస్ నుంచి స్పూర్తి పొందిన బీజేపీ రాజకీయంగా ఈ రోజు బలంగా ఉంది. బీజేపీకి ఈ దేశం మూలాలు తెలుసు. దేశం కష్టాలు తెలుసు.
మరో వైపు చూస్తే ఉత్తరాది దక్షిణాది అంటూ జరుగుతున్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది బీజేపీ చేతులలోనే ఉంది. ప్రస్తుతం డీలిమిటేషన్ మీద వివాదం రేగుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే కనుక కచ్చితంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిపోతోంది.
అదే సమయంలో ఉత్తరాదిన జనాభా అంతకంతకు పెరిగిపోతోంది. దాంతో అదే క్రెడిటేరియా అయితే దక్షిణాదిన ఉన్న రాష్ట్రాల ప్రజలు రాజకీయ నాయకుల ఆవేదన నిజం అవుతుంది. అలా కాకుండా వేరే మార్గాలని కేంద్రం చూడాల్సి ఉంది.
ఈ రోజుకి కూడా డీలిమిటేషన్ మీద విధివిధానాలు రూపొందించలేదు అంతా అనుమానాలు మాత్రమే అని బీజేపీ నేతలు అంటున్న నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన అన్నది పక్కన పెట్టి దామాషా పద్ధతిలో కనుక రాష్ట్రాలలో ఎంపీల సీట్లు పెంచితే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
పైగా అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్ లో ఎన్ని పెంచారో అదే సూత్రం మీద దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలకు కూడా ఎంపీ సీట్లు పెంచాలి. అపుడి ఈ తరహా వివాదాలకు తెర పడుతుంది. అంతే కాదు దేశంలో వివక్ష లేదని అంతా ఒక్కటి అన్న గొప్ప సందేశం కూడా జాతి జనులకు వెళ్తుంది.
బీజేపీ మాత్రమే ఈ పని చేయగలదు. ఇక పాతికేళ్ళ పాటు డీలిమిటేషన్ ని వాయిదా వేయమనడం భావ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల భాగస్వామ్యం అన్నది చాలా ముఖ్యం. అందువల్ల మధ్యే మార్గాన్ని ఈ విషయంలో కనుగొనాలి. దాని కంటే ముందు డీలిమిటేషన్ మీద కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
అక్కడ వివిధ పార్టీల నుంచి వచ్చే సలహా సూచనలు తీసుకోవాలి. డీలిమిటేషన్ ఈ దేశంలో ఎలా చేయాలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలో అన్న దాని మీద వీలైతే నిపుణులతో కమిటీని వేసి మరీ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి. లేకపోతే దక్షిణాది రాష్ట్రాల అఖిల పక్ష సమావేశాలు బహిరంగ సభలు అని మరింతగా ఈ ఇష్యూ హాట్ హాట్ గా ఉండే చాన్స్ ఉంది.