డీలిమిటేషన్ తొలి దెబ్బ ప్రాంతీయ పార్టీలకే !
లోక్‌సభలో 888 మంది పార్లమెంటు సభ్యులకు సౌకర్యవంతంగా వసతి కల్పించేలా దీనిని రూపొందించారు, ఇది పాత లోక్‌సభ సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువగా చేశారు.
By: Tupaki Desk | 17 March 2025 4:00 AM ISTడీలిమిటేషన్ విషయంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఒక ప్రణాళిక ప్రకారం అంతా చేసుకుంటోంది. బీజేపీ ఈ విషయంలో ఎంత అలెర్ట్ గా ఉందంటే 2022లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించింది. అందులో కేవలం 888 మంది మాత్రమే ఎంపీలు కూర్చునే విధంగా నిర్మాణం జరిగింది.
లోక్‌సభలో 888 మంది పార్లమెంటు సభ్యులకు సౌకర్యవంతంగా వసతి కల్పించేలా దీనిని రూపొందించారు, ఇది పాత లోక్‌సభ సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువగా చేశారు. అలాగే కొత్త రాజ్యసభ సమావేశ మందిరంలో 384 మంది సభ్యులకు సీట్లు ఉంటాయి. ఈ విధంగా చూస్తే కనుక బీజేపీ ముందే డీలిమిటేషన్ మీద ఒక అవగాహన పెంచుకుని ఈ విధంగా చేసింది అని భావించాల్సి ఉంది.
అంటే ఈ రోజున దేశంలో 543 ఎంపీ సీట్లు ఉంటే అవి ఎంతవరకూ పెరుగుతాయన్న అంచనా బీజేపీకి ముందుగా ఉందని అంటున్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని బీజేపీ భావిస్తోంది ఇక ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలో పాతిక నుంచి ముప్పయి లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. ఈ రకమైన జనాభా ఉత్తరాదిన ఎక్కువగా ఉంది. దాంతో దీనిని 20 లక్షలకు చేయాలని డీలిమిటేషన్ లో పెట్టుకున్నారని అంటున్నారు.
ఆ విధంగా చేస్తే ఉత్తరాదిన ఇపుడు ఉన్న సీట్లకు మరింత ఎక్కువగా సీట్లు పెరుగుతాయి. కేవలం యూపీ బీహార్ లలో కలుపుకుని ఏకంగా 200 ఎంపీ సీట్లు ఈ డీలిమిటేషన్ లో అవుతాయని అంటున్నారు. ఇక ఈ దేశంలో 143 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రతీ ఇరవై లక్షల జనాభాకు ఒక లోక్ సభ సీటు అనుకుంటే 715 దాకా ఎంపీ సీట్లు పెరుగుతాయని ఒక అంచనా ఉంది.
ఇక ఇందులో ఉత్తరాదిన జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడే సీట్లు అధికంగా పెరుగుతాయని అంటున్నారు. ఈ విషయంలో దక్షిణాదికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఆందోళన అయితే మేధావులలో ఉంది. దక్షిణాదిన చూసుకుంటే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఉన్నాయి. ఈ అయిదు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎంపీల సంఖ్య 130 గా ఉంది.
ఇక జనాభా విషయం తీసుకుంటే ఏపీలో అయిదు కోట్ల మూడున్నర లక్షలు ఉంటే తెలంగాణా మూడు కోట్ల 8 లక్షల దాకా ఉంది. తమిళనాడులో ఏడు కోట్ల ఏడు లక్షలుగా ఉంటే కర్ణాటకలో ఆరు కోట్ల రెండు లక్షలుగా ఉంది. కేరళలో మూడున్నర కోట్ల జనాభా ఉంది. ఈ మొత్తం జనాభాను కలిపితే పాతిక కోట్ల దాకా జనాభా అవుతుంది.
ఇక ప్రతీ ఇరవై లక్షలకు ఒక ఎంపీగా డీలిమిటేషన్ లో తీసుకుంటే 125 ఎంపీలే వస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న 130 కంటే ఏకంగా అయిదు ఎంపీ సీట్లు తగ్గిపోతాయన్న మాట. దీంతో డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఇకపోతే దక్షిణాదిన ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలుగు నాట తెలుగుదేశం బీఆర్ఎస్ వైసీపీ, మజ్లీస్, జనసేన వంటివి ఉన్నాయి.
ఇక కర్ణాటకలో జేడీఎస్ ఉంటే తమిళనాడులో డీఎంకే అన్నాడీఎంకే, సినీ నటుడు విజయ్ కొత్త పార్టీ ఉంది. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా కొనసాగుతూ పార్లమెంట్ లో తమ ఉనికిని చాటుతున్నాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిన సీట్లు తగ్గిపోతే ఆటోమేటిక్ గా ప్రాంతీయ పార్టీల రాజకీయ ప్రాబల్యం కూడా పోతుంది.
ఎందుకంటే ఉత్తరాది సీట్లతోనే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అధికారంలోకి వస్తాయి. దాంతో మెల్లగా దక్షిణాదిన ప్రాంతీయ వాయిస్ పోయి కాంగ్రెస్ బీజేపీ ఆ ప్లేస్ ని ఆక్రమించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బీజేపీ ఈ రోజున డీలిమిటేషన్ చేస్తున్నా కాంగ్రెస్ కి కూడా అది ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఆ మాటకు వస్తే జాతీయ పార్టీలకు పోయింది ఏమీ లేదు. ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదు. దక్షిణాదిన మాత్రం ప్రాంతీయ పార్టీలకు పెద్ద దెబ్బ పడుతుంది అని అంటున్నారు.
అయితే తమిళనాడులోని పార్టీలే ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూంటే తెలుగునాట పార్టీలు మాత్రం కిమ్మనకుండా ఉన్నాయి. ఈ చోద్యం చూసే తీరు మంచిది కాదని అసలుకే ఎసరు తెస్తుందని అంటున్నారు. మేలుకోవాల్సింది మాత్రం ప్రాంతీయ పార్టీలే. దాని కంటే ముందు కేంద్రంలోని ఎన్డీయే కూటమికి ప్రాణ వాయువు అందిస్తున్న టీడీపీ జనసేన ఈ విషయంలో గట్టిగా పోరాడాలని వైసీపీ బీఆర్ఎస్ వంటివి కూడా గళం విప్పాలని అంతా కోరుతున్నారు.