Begin typing your search above and press return to search.

ఏఐ ఎఫెక్ట్... డెల్ లో 12,500 ఉద్యోగుల తొలగింపు!

అవును... ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ “డెల్” షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 7:44 AM GMT
ఏఐ ఎఫెక్ట్... డెల్  లో 12,500 ఉద్యోగుల తొలగింపు!
X

టెక్ పరిశ్రమలో గత రెండేళ్ల నుంచి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ అవిరామంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే! అయితే.. అప్పట్లో ప్రధానంగా ఆర్థిక మాంద్యం ఆందోళన కారణంగా పలు సంస్థలు ఈ నిర్ణయాలు తీసుకునేవి. ఈ క్రమంలో.. కారణం ఏదైనా ఇప్పటికే టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ నేపథ్యంలో మరో టెక్ దిగ్గజం లేఆఫ్స్ ప్రకటించింది.

అవును... ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ “డెల్” షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒకేసారి ఏకంగా 10శాతం మంది ఉద్యోగులను తీసేయాలని డిసైడ్ అయ్యిందని అంటున్నారు. 10శాతం మంది ఉద్యోగులు అంటే.. సుమారు 12,500 మంది అన్నమాట. ఈ విషయాన్ని డెల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్నల్ సమాచారం మేరకు ఉద్యోగులకు తెలిసినట్లు కథనాలొస్తున్నాయి.

ఇలా ఒకేసారి 12 వేల 500 మంది ఉద్యోగులను తొలగించడానికి గల కారణాలపైనా స్పష్టత వస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా డేటా సెంటర్ ను అప్ డేట్ చేస్తున్నారని.. ఇలా ఏఐపై దృష్టిపెట్టే వ్యూహంలో భాగంగా కంపెనీ తన మ్యాన్ పవర్ ను తగ్గిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ లోని 12,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి డెల్ ఇలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. గత ఏడాది (2023)లోనూ కంపెనీ 13వేల మంది ఉద్యోగులను తొలగించిందని, అయితే ఆ వివరాలు పూర్తిగా బయటకు రాలేదని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఏది ఏమైనా... డెల్ తాజా నిర్ణయాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. దీనిని వారు రక్తకన్నీరుగా అభివర్ణిస్తున్నారు.

ఇలా అమెరికాలోని అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న డెల్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా ఐటీ కంపెనీల్లో పరిస్థితి ఏమిటనే టెన్షన్ ఆయా కంపెనీల్లోని ఉద్యోగులకు ఇప్పటికే మొదలైందని అంటున్నారు. ఏఐ ఎఫెక్ట్ ఐటీ రంగంపై తీవ్రంగా ఉందని, రాబోయే రెండేళ్లలో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెబుతున్నారు!