Begin typing your search above and press return to search.

త్వరలో కేజీ వెండి రూ.లక్ష.. ఎందుకంత డిమాండ్?

ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది వెండి దిగుమతులు 6500 కేజీల నుంచి 7వేల టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:50 AM GMT
త్వరలో కేజీ వెండి రూ.లక్ష.. ఎందుకంత డిమాండ్?
X

ఆభరణాల విషయంలో బంగారమే ముందు ఉంటుంది. కానీ.. కొద్దికాలంగా వెండి మీద ఆసక్తి పెరుగుతోంది. బంగారం.. వెండి లోహాల్ని దిగుమతి చేసుకోవటంలో భారతదేశం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాదిలో మనం దిగుమతి చేసుకున్న వెండి 3625 మెట్రిక్ టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు). వెండిని ఆభరణాల కంటే కూడా పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. పెరిగిన పారిశ్రామిక డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది వెండి దిగుమతులు రికార్డుల్ని క్రియేట్ చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది వెండి దిగుమతులు 6500 కేజీల నుంచి 7వేల టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చూస్తే ఈ ఏడాది తొలి అర్థభాగంలోనే 4554 టన్నుల వెండిని దిగుమతి చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గత ఏడాది తొలి ఆర్నెల్లలో దిగుమతి చేసుకున్న వెండి 560 టన్నులు కాగా.. ఈఏడాది దానికి పది రెట్ల వరకు దిగుమతి చేసుకోవటం విశేషం. ఈ ఏడాది వెండి ఆభరణాలకు గిరాకీ విపరీతంగా పెరిగిందని.. దీనికి తోడు సుంకం తగ్గించటంతో ధరలు దిగి వచ్చినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. వెండిని పెట్టుబడికి మార్గంగా భావిస్తున్న వారి సంఖ్య పెరిగింది. బంగారం కంటే కూడా వెండిలో మదుపు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయన్న అంచనాలు ఎక్కువ అవుతున్నట్లు చెప్పారు. ఈ జులైలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో వెండిపై సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించటంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. దీంతో.. దిగుమతులు భారీగా పెరిగాయి. దీనికి తోడు సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి కీ రోల్ ప్లే చేస్తుంది. వెండి ఆభరణాల కోసం వినియోగించేది 20 శాతమైతే.. పారిశ్రామికఅవసరాల కోసమే 80 శాతం వెండిని వినియోగిస్తున్నారు.

మనం దిగుమతి చేసుకునే వెండిలో అత్యధికం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. బ్రిటన్.. చైనా నుంచే వస్తుంది. ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,700 వరకు ఉంది. ఈ ఏడాది మేలో వెండి ధర రికార్డు స్థాయిలో కేజీ రూ.96వేలకు పైనే ఉండటం తెలిసిందే. ఆ తర్వాత ధర తగ్గింది. అయితే.. రానున్న రోజుల్లో కేజీ వెండి రూ.లక్ష మార్కును టచ్ చేయటం ఖాయమని.. అంతకంతకూ పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వెండి ధర పెరగనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.