గ్రేటర్ లో పంజా విసురుతున్న డెంగ్యూ ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఈ సమయంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ పంజా విసురుతోంది.
By: Tupaki Desk | 30 July 2024 11:38 AM GMTతెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇక నాలుగు చినికులు పడితే డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తుండటం కామనైపోయిందని అంటుంటారు.. ఈ సమయంలో సీజనల్ వ్యాదులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సమయంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ పంజా విసురుతోంది.
అవును... ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ పంజా విసురుతోంది. ప్రధానంగా చిన్నపిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. ఈ సీజన్ లో పిల్లలకు జ్వరం వస్తే... సాధారణ జ్వరమే కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం చేస్తే ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రతీ రోజూ అటు గాంధీ ఆస్పత్రిలో, ఇటు నీలోఫర్ ఆస్పత్రిలోనూ కనీసం ఐదారుగురు చిన్నారులు డెంగ్యూ జ్వరంతో చేరుతున్నారని అంటున్నారు. బాధితుల్లో 3 నెలల పసికందు నుంచి 10ఏళ్ల చిన్నారుల వరకూ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జూలై 2024లో హైదరాబాద్ లోనే సుమారు 1,345 కేసులు నమోదయ్యాయని అంటున్నారు.
వ్యాది లక్షణాలు!:
డెంగ్యూ సోకిన వారికి ఆకస్మికంగా జ్వరం వస్తుంది.. దీనితో పాటు తలనొప్పి, తీవ్రమైన కండరాల నొప్పి, అలసటగా ఉండటం, వికారం, వాంతులు అవుతుంటాయని.. ఇదే సమయంలో చర్మంపై దద్దుర్లు వస్తాయని.. ఇవి జ్వరం ప్రారంభమైన రెండు నుంచి ఐదు రోజుల తర్వాత కనిపిస్తాయని చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు!:
డెంగ్యూ జ్వరం అనేది దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి... ఇంటిలోపలకు దోమలు రాకుండా చూడాలి.. పిల్లలు పడుకున్న మంచానికి వీలైనంత వరకూ దోమతెరలు వాడాలి. జ్వరం వచ్చి రెండు మూడు రోజులైనా తగ్గకపోయినా.. ఒంటిపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి తదితర లక్షణాల్లో ఏవైన రెండు లేదా అంతకంటే ఎక్కువ కనిపించినా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
అనంతరం డెంగ్యూ టెస్ట్ చేయించుకోవాలి. టెస్టుల్లో పాజిటివ్ అని వస్తే.. అనంతరం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య తెల్లుస్తుంది. ఆరోగ్యంగా ఉండేవారిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ప్లేట్ లెట్లూంటాయి. ఈ ఫీవర్ వస్తే వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంటుంది.
ప్రధానంగా కుండీలు, తాగేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు వంటివాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.. దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు!