డిపాజిట్లు గల్లంతు...గాజు గ్లాస్ కి ఏంటి పాట్లు బాసూ..
తెలంగాణాలో మాకు బలం ఉంది 32 సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది
By: Tupaki Desk | 3 Dec 2023 12:09 PM GMTజనసేనకు తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయడం తొలి అనుభవం. 2014లో అక్కడే పార్టీని పెట్టినా కూడా పోటీ చేయడానికి మాత్రం పదేళ్ళు టైం పట్టింది. తెలంగాణాలో మాకు బలం ఉంది 32 సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. చివరికి బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగింది.
ఎనిమిది సీట్లకు పోటీ చేస్తే ఎనిమిది చోట్లా డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇది నిజంగా అవమానమే అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలకు జనం అయితే తండోప తండాలుగా వచ్చారు. కానీ తీరా ఈవీఎం మిషన్లు చూస్తే ఓట్లు నోటా కంటే తక్కువ పడడంతో పవర్ అంతా స్పీచ్ లకేనా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.
ఇక జనసేన పోటీ చేసిన సీట్లు చూస్తే కోదాడ - మేకల సతీష్ రెడ్డి, తాండూరు - నేమూరి శంకర్ గౌడ్, ఖమ్మం - మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం - లక్కినేని సురేందర్‌రావు, అశ్వారావుపేట (ఎస్టీ) -ముయబోయిన ఉమాదేవి, వైరా (ఎస్టీ) - సంపత్ నాయక్, నాగర్ కర్నూల్- వంగల లక్ష్మణ్ గౌడ్, కూకట్‌పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఉన్నారు.
ఇందులో అన్ని చోట్లా జనసేనకు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న కూకట్ పల్లిలోనూ జనసేన పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయింది. ఇదిలా ఉంటే కూకట్ పల్లిలో ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అయినా సరే ఆ ఓట్లు మాత్రం జనసేనకు పడలేదు. అదే టైం లో కాంగ్రెస్ ప్రభంజనం బలంగా వీచినా కూకట్ పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణా రావు ఏకంగా 64 వేల ఓట్ల తేడాతో గెలిచారు
ఇక మిగిలిన చోట్ల చూస్తే చాలా తక్కువ ఓట్లు వేయి లోపు వచ్చాయని తెలుస్తోంది. దాంతో బర్రెలక్క మీద కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి అని జనసేన అభ్యర్ధుల మీద ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయో జనసేన ఏ విధంగా వీటిని సర్దుకుంటుందో చూడాలని అంటున్నారు.