ట్రబుల్ షూటర్ పై గాంధీ ఫ్యామిలీ గుర్రు.. ఇప్పుడేం కానుంది?
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందన్న విషయం గడిచిన పదేళ్లుగా చూస్తున్నదే.
By: Tupaki Desk | 10 Sep 2024 1:30 PM GMTఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందన్న విషయం గడిచిన పదేళ్లుగా చూస్తున్నదే. మోడీ ఎంట్రీతో మారిన సమీకరణాలు ఒక వైపు.. వయసు మీద పడిన సోనియమ్మ.. రాహుల్, ప్రియాంకల ఫెర్ ఫార్మెన్స్ వెరసి ముసలైన పార్టీకి పెద్ద దిక్కు లేని పరిస్థితి. ఏదైనా సమస్య వస్తే.. తీర్చే నాథుడు లేకుండా పోయిన పరిస్థితి. గతంలో పెద్ద తలకాయలు భారీగా ఉండటమే కాదు.. విషయం ఏదైనా ఇట్టే ఎంట్రీ ఇచ్చి.. సమస్యను సాల్వ్ చేసే వాళ్లు అరడజను వరకు రెఢీగా ఉండేవారు. కాలక్రమంలో వారంతా పెద్దోళ్లు అయిపోవటం.. కొత్త తరంలో అలాంటి సమర్థులు లేని దుస్థితి.
ఈ మధ్యనే ఒక్కొక్కరుగా వెలుగు చూస్తున్నారు. అలా కాంగ్రెస్ పార్టీకి ట్రుబుల్ షూటర్ గా ఉన్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. పని ఏదైనా సరే.. టాస్కు ఇచ్చి పంపిస్తే.. లెక్కలు తేల్చేసే రకం. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టిన చందంగా.. దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ అధికారంలో ఉందంటే ఆయన పుణ్యమని చెప్పాలి. అలాంటి డీకే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖంగుతినేలా వ్యవహరించారన్న ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన.. కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు.. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావటం పార్టీ అధినాయకత్వం షాక్ తినేలా చేసిందంటున్నారు. ‘ముడా’ ఇంటి స్థలాల వివాదంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వటం తెలిసిందే. ఈ అంశంపై పార్టీ ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ద.. డిప్యూటీ సీఎం డీకేలు ఆగస్టు మూడో వారంలో ఢిల్లీకి వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సొంత పార్టీ ముఖ్యమంత్రులకే భేటీలకు టైం ఇవ్వని మోడీ.. డీకేకు సమయం ఇవ్వటం ఏమిటన్నది బీజేపీలోనే కాదు కాంగ్రెస్ లోనూ చర్చనీయాంశంగా మారింది. ఏ చిన్న అవకాశం లభించినా..తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే టాలెంట్ ఉన్న మోడీషాలకు.. డీకేలాంటోడు జత కలిస్తే.. అగ్నికి వాయువు తోడైనట్లు అవుతుంది. అందుకే..కాంగ్రెస్ అధిష్ఠానంలో కలవరపాటు మొదలైంది.
తమ అనుమతి లేకుండా ప్రధాని మోడీతో ఎలా భేటీ అవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. మంత్రిగా పలు డెవలప్ మెంట్ అంశాల మీదనే పీఎం మోడీని కలిశానని.. రాజకీయ ఉద్దేశం లేనట్లుగా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాహుల్ అమెరికా టూర్ లో ఉన్న వేళ.. డీకే సైతం ఆ దేశానికి వెళ్లటం.. అక్కడ యువరాజా వారిని కలవటం ఎజెండా ఉందంటున్నారు.మొత్తానికి కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ కాస్తా ట్రబుల్ అయ్యాడన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.