Begin typing your search above and press return to search.

స్టాలిన్ కొడుకు ఉప ముఖ్యమంత్రి...డీఎంకేకి కొత్త చిక్కులు ?

మొత్తానికి స్టాలిన్ కే కాదు డీఎంకే కి కూడా సన్ స్ట్రోక్ గట్టిగా తగులుతుందా అన్న చర్చ అయితే తమిళనాడు రాజకీయ వర్గాలలో సాగుతోంది.

By:  Tupaki Desk   |   26 Aug 2024 11:30 PM GMT
స్టాలిన్ కొడుకు ఉప ముఖ్యమంత్రి...డీఎంకేకి కొత్త చిక్కులు ?
X

మరో ఏణ్ణర్ధం గట్టిగా లేదు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు. ఇప్పటి నుంచే పార్టీ దూకుడు చేయాలి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 39 ఎంపీ సీట్లను గెలుచుకుంది డీఎంకే కూటమి. అయితే అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారా అంటే చెప్పలేని రాజకీయ పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.

డీఎంకేకి సర్వసత్తాక అధికారిగా పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు. అయితే ఆయనకు మద్దతు ఇచ్చిన వారు అంతా కరుణానిధి కాలం నుంచి పార్టీని మోస్తున్న వారే. వారిలో సీనియర్ లీడర్లు ఉన్నారు. వారంతా డీఎంకేని అల్లుకుని తన రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించుకుంటున్నారు.

అయితే డీఎంకేలో కొత్త నీరు తేవాలని స్టాలిన్ చూస్తున్నారు. దాదాపుగా ఏడున్నర పదుల వయసులో ఉన్న స్టాలిన్ తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ఎంచుకున్నారు. అలా ఉదయనిధి స్టాలిన్ తండ్రి కేబినెట్ లో మంత్రి అయ్యారు. అయితే 2026 ఎన్నికల్లోగా ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తే ఆ ఎన్నికల నాటిని ప్రొజెక్షన్ ఆయన మీద ఉంటుందని, 2026 ఎన్నికల తరువాత ఒకవేళ వీలు అయితే సీఎం సీట్లో కూడా కూర్చోబెట్టి తాను జాతీయ రాజకీయాలకు వెళ్లలని స్టాలిన్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.

అయితే అంతా బాగానే ఉంది కానీ స్టాలిన్ ప్లాన్ కి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోంది అని అంటున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఆరు సార్లు మంత్రిగా పనిచేసిన దురై మురుగన్ బలమైన నేతగా డీఎంకేలో ఉన్నారు. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన కరుణానిధి కాలం వారు. సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం హోదా అయినా తనకు దక్కకపోతే ఈ రాజకీయం ఎందుకు అనేది ఆయన ఆలోచనగా ఉందిట.

పైగా ఆయన ఇటీవల కాలంలో మీడియా ముందుకు వచ్చి డిప్యూటీ సీఎం పదవి వస్తే ఎవరు వదులుకుంటారు అని చెప్పాల్సింది చెప్పేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే స్టాలిన్ కి మురుగన్ రూపంలో అసమ్మతి పొంచి ఉందని అర్ధం అవుతోంది. నిజానికి ఏడాది మొదట్లోనే ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం కావాల్సి ఉంది.

దానికి ముహూర్తం అని ప్రచారం సాగినా కొట్టిపారేశారు పార్టీ వర్గాలు. స్వయంగా ఉదయనిధి కూడా మీడియా ముందుకు వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంతో మంది అర్హులు ఉన్నారని చెప్పారని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఎన్నికలు తోసుకొస్తున్న వేళ కుమారుడికి రాజకీయ పట్టాభిషేకం చేయడానికి స్టాలిన్ ఆరాటపడుతూంటే మురుగన్ వంటి వారు మాత్రం తమకు చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని అంటున్నారు.

ఇది ఏమైనా పార్టీలో చీలికకు దారి తీసేలా ఉందా అన్న చర్చ సాగుతోంది. ఇంకో వైపు చూస్తే తమిళనాడులో మరో సూపర్ స్టార్ విజయ్ పార్టీని పెట్టారు. ఆయన డీఎంకేకు ఆల్టర్నేషన్ గా కనిపిస్తున్నారు. డీఎంకేలో ఉదయనిధిని ముందుకు తెస్తే నచ్చని వారు ఆ వైపు వెళ్తే మొదటికే మోసం వస్తుంది. దాంతో ఏమి చేయాలో అర్థం కాక స్టాలిన్ అయోమయంలో పడ్డారని అంటున్నారు. మొత్తానికి స్టాలిన్ కే కాదు డీఎంకే కి కూడా సన్ స్ట్రోక్ గట్టిగా తగులుతుందా అన్న చర్చ అయితే తమిళనాడు రాజకీయ వర్గాలలో సాగుతోంది.