డిప్యూటీ సీఎం నారాయణస్వామికి సొంతోళ్లే షాకిచ్చారు
కీలకమైన పదవిలో ఉన్న ఆయన బయట వారిని తర్వాత సొంత పార్టీ నేతల మెప్పు పొందలేకపోతున్నారు
By: Tupaki Desk | 3 Aug 2023 5:12 AM GMTఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి అనూహ్య రీతిలో షాక్ తగిలింది. కీలకమైన పదవిలో ఉన్న ఆయన బయట వారిని తర్వాత.. సొంత పార్టీ నేతల మెప్పు పొందలేకపోతున్నారు. దీంతో.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన పక్షంలో తాము పని చేసేది లేదని అధికార పార్టీ నేతలు తేల్చి చెప్పిన వైనం ఇప్పుడు కలకలంగా మారింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణస్వామిపై సొంతోళ్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎంపీపీ హేమలత.. వైసీపీ మండల అధ్యక్షుడు సురేశ్ రెడ్డితో పాటు ఇతర నాయకులు.. మద్దతుదారులంతా కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారాయణరెడ్డి గెలుపు కోసం తాము రెండుసార్లు పని చేశామని.. అయితే ఆయన ఏకపక్ష వైఖరి అనుసరిస్తూ నేతల్ని దూరం పెడుతున్నారని మండిపడుతున్నారు.
మండలంలో ఏ కార్యక్రమాన్నిచేపట్టినా తమకు సమాచారం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. తనకు పార్టీ నేతలు అవసరం లేదని.. జగనన్న పథకాలే తనను గెలిపిస్తాయని చెబుతున్నారన్నారు. ఈ కారణంగానే ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే.. ఆయనకు పని చేసేదే లేదని తేల్చి చెప్పారు. ఓవైపు ముఖ్యమంత్రి తరచూ స్థానిక నాయకత్వంతో సత్ సంబంధాలు కలిగి ఉండటం.. అందరిని కలుపుకొని వెళ్లాలని పదే పదే చెబుతున్నా.. అందుకు భిన్నంగా కొందరు నేతలు అనుసరిస్తున్న వైఖరిపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరి.. తాజా నిరసనపై సీఎం జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.