ఐటీ శాఖ పని చేయట్లేదని ఏపీ డిప్యూటీ సీఎం అంటున్నారా?
ఈ క్రమంలో ఐటీ శాఖ పని తీరును క్వశ్చన్ చేసేలా ఉన్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది
By: Tupaki Desk | 10 Aug 2023 5:22 AM GMTకీలక స్థానాల్లో ఉండే రాజకీయ నేతల నోటి మాటకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే.. తొందరపడి ఒక మాట అనకూడదని చెబుతుంటారు. మరి.. ఏమైందో ఏమో కానీ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కొద్ది రోజులుగా టాలీవుడ్ లోని కొందరు నటీనటులు వర్సెస్ ఏపీ సర్కారు అన్నట్లుగా పరిస్థితులు మారటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లోకి తాజాగా వచ్చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో.. తెలుగు సినిమాకు సంబంధించి కొందరు హీరోలు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని.. అందులో సగం మొత్తానికి కూడా పన్ను కట్టట్లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు దారిన పోయే దానయ్య అంటే ఇబ్బంది కాదు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేత నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.
ఆయన ఇలాంటి ఆరోపణలు చేసే ముందు.. దానికి సంబంధించిన ఆధారాల్ని ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది. అందుకు భిన్నంగా చీకట్లో రాయి వేసినట్లుగా వ్యాఖ్యానించటం వల్ల.. తెలుగు సినీ నటుల సంగతేమో కానీ.. ఐటీ శాఖకే ఇబ్బంది ఎక్కువ అంటున్నారు. ఎందుకంటే.. సినీ హీరోలు తమకొచ్చే రెమ్యునరేషన్ లో సగానికి కూడా ఆదాయపన్ను కట్టటం లేదన్నది నిజమే అయితే.. వారిని ఆదాయపన్ను శాఖ చూస్తూ ఊరుకోదు కదా? వారిపై తనిఖీల అస్త్రాన్ని ప్రయోగిస్తుంది కదా? ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పరిగణలోకి తీసుకోవట్లేదా? అన్నది సందేహం.
సినీ హీరోలు కొందరు అంటూ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేసే వరకు బాగానే ఉన్నా.. ఈ క్రమంలో ఐటీ శాఖ పని తీరును క్వశ్చన్ చేసేలా ఉన్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అందుకే.. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి వీలుగా.. ఫలానా వారు ఫలానా మొత్తానికి ఐటీ కట్టాల్సి ఉంటే.. ఇంతే కట్టారంటూ ఆధారాలతో చూపిస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉండటమే కాదు.. డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడే మాటల్లో ఎంత నిజాయితీ ఉండేదో అర్థమయ్యేదంటున్నారు.
సినీ నటుల ఆదాయం.. వారు చెల్లించే ఆదాయపన్ను మీద కామెంట్లు చేసిన నారాయణ స్వామి.. జనసేన అధినేత పవన్ మీదా పంచ్ లు వేశారు. కాకుంటే పేరును ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ.. ఆయన మాట్లాడిన మాటలు పవన్ ను ఉద్దేశించే చేసినవన్నది స్పష్టంగా అర్థమయ్యేలా ఉండటం గమనార్హం. ''గత ఎన్నికల్లో ఒకాయన రెండుచోట్ల పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోయారు'' అంటూ మాట్లాడటమే కాదు.. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు.