Begin typing your search above and press return to search.

ఉప ముఖ్యమంత్రి...రాజ్యాంగంలో లేదా ?

మనం తరచూ వింటూ ఉంటాం ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి అన్న పదవుల గురించి

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:42 PM GMT
ఉప ముఖ్యమంత్రి...రాజ్యాంగంలో లేదా ?
X

మనం తరచూ వింటూ ఉంటాం ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి అన్న పదవుల గురించి. నిజానికి వీటికి ఉన్న ప్రాముఖ్యత అంతా రాజకీయ పరమైనదే తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఈ పదవులకు లేదు అన్నది వాస్తవం. మన రాజ్యాంగం లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవులకు మాత్రమే నిర్దేశించింది.

ఈ రెండు పదవులు తప్ప మిగిలిన వారు అంతా మంత్రుల కిందకే వస్తారు. ఇదంతా ఎందుకు అంటే జనసేన అధినేత సినీ రంగంలో పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. దాంతో ఈ పదవి ప్రాముఖ్యత గురించి ఇపుడు అంతా చర్చిస్తున్నారు.

అయితే ఉప ముఖ్యమంత్రి అని ప్రత్యేక గుర్తింపు అన్నది రాజ్యాంగం ప్రకారం లేదు అందుకే పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగానే ప్రమాణం చేశారు. అయితే ఏదైనా ప్రభుత్వంలో మంత్రి కంటే స్థాయి పెంచి ఉన్నత పదవిగా వారికి ఇవ్వాలనుకున్నపుడు ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తారు. అయితే ఇది పాలనాపరంగా సౌలభ్యంతో పాటు రాజకీయంగా ఎక్కువ గుర్తింపు కోసమే తప్ప ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అధికారాలు అయితే ఉండవు అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

వారు కూడా అందరి మంత్రుల మాదిరిగానే ఉంటారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఉప ముఖ్యమంత్రులుగా ఇప్పటిదాకా అయిన వారు ఎవరు అంటే మద్రాస్ రాష్ట్రం నుంచి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం విడిపోయినపుడు తొలి సీఎం గా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారు. ఆయన మంత్రివర్గంలో మొదటి ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పనిచేశారు. ఇది 1953 అక్టోబర్ 1న జరిగింది. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రుల జాబితా చూస్తే కనుక ఉమ్మడి ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా కొండా వెంకట రంగారెడ్డి 1959లో రెండవ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నీలం సీఎం గా ఉండగా డిప్యూటీ సీఎం గా పనిచేశారు.

ఆ తరువాత జేవీ నరసింగ రావు 1967లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1982లో సి జనార్ధనరావు, 1992లో కోనేరు రంగారావు, 2011లో దామోదర రాజనరసింహా ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంలుగా సేవలు అందించారు

ఇక 2014లో విభజన ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉంటే నిమ్మకాయల చినరాజప్ప, అలాగే కేఈ క్రిష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 2019లో వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితా పెద్దగానే ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్ప శ్రీవాణి, ఆళ్ల నాని, అంజాద్ భాషా, కె నారాయణస్వామి, ధర్మాన క్రిష్ణ దాస్, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్నదొర ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. మొత్తం ఈ లిస్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ ఇందులో 17వ వారుగా ఉంటారు.