తమిళనాటా స్ట్రాంగ్ డిప్యూటీ సీఎం.. ఆయనకే పదవి.. మంత్రి వర్గంలో భారీ మార్పులు
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్.. కర్ణాటకలో డీకే శివకుమార్.. తెలంగాణలో భట్టి విక్రమార్క.. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్
By: Tupaki Desk | 18 July 2024 9:50 AM GMTమహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్.. కర్ణాటకలో డీకే శివకుమార్.. తెలంగాణలో భట్టి విక్రమార్క.. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్.. వీరంతా పరిచయం అక్కర్లేని పేర్లు.. వ్యక్తిగతంగానూ బలమైన నాయకులు.. ప్రజాదరణలోనూ ఎవరికీ తీసిపోరు.. అయితే, అందరిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే.. డిప్యూటీ సీఎంలు. మరి తమిళనాడులో..? అక్కడ కూడా ఓ బలమైన నాయకుడు డిప్యూటీ సీఎం కాబోతున్నారు. అందులోనూ ఆయన ఏకంగా సీఎం కుమారుడు.
వారసుడిని తీసుకొస్తున్నారా?
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత సీఎం అయ్యారు. ఆయన తండ్రి కరుణానిధి సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండడంతో స్టాలిన్ సీఎం కావడం ఆలస్యమైంది. అయితే, తన కుమారుడి విషయంలో ఇది జరగకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడు మంత్రివర్గంలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. తన కుమారుడు ఉదయ నిధిని ఉప ముఖ్యమంత్రిని చేయనున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమల రంగంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు స్టాలిన్ త్వరలో అమెరికా వెళ్లనున్నారు. దీంతో అధికారం, పార్టీ, ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేస్తారని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నాటికి..
తమిళనాడులో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కరుణానిధి లేకుండా డీఎంకే తొలిసారి ఎన్నికల్లో గెలిచింది. ఇక ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పుదుచ్చేరితో కలిపి 40 నియోజకవర్గాల్లోనూ డీఎంకే కూటమే విజయదుందుభి మోగించింది. కాగా.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే ఉంది. దీంతో 70 ఏళ్లు దాటిన స్టాలిన్ భవిష్యత్ నాయకుడిగా కుమారుడు ఉదయనిధిని తెరపైకి తెస్తున్నట్లు పేర్కొంటున్నారు. 200 పైగా స్థానాల్లో డీఎంకే కూటమిని గెలిపించాలనే టార్గెట్ తో ఉన్న స్టాలిన్.. దీనికోసం ప్రభుత్వం, పార్టీలో భారీ మార్పులు చేయనున్నారని వివరిస్తున్నారు. మంగళవారం ఒకేసారి 65 మంది ఐఏఎస్ లను కదిలించారు. వీరిలో కీలక పదవుల్లోని సీనియర్ ఐఏఎస్ లూ ఉన్నారు. ఇంకా మార్పులు చేస్తారని.. ఆ తర్వాత మంత్రి వర్గం సంగతి చూస్తారని ప్రచారం జరుగుతోంది. అసలు మంత్రివర్గంలో మార్పులపై కొద్ది నెలలుగా ఊహాగానాలు వస్తున్నాయి. సీనియర్ మంత్రుల శాఖలు మారుస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉదయ నిధిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని స్టాలిన్ నిర్ణయించినట్టు చెబుతున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఉన్నట్లే.. డీఎంకేలోనూ కుటుంబానికి ప్రాధాన్యం దక్కుతుంది. ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలంటూ సీనియర్ మంత్రులే కోరడం గమనార్హం. ఆగస్టు 15లోగా మార్పులు ఉంటాయని పేర్కొంటున్నారు.