Begin typing your search above and press return to search.

వీడెవడండీ బాబూ.. ఖాకీలు కనిపిస్తే కరిచేలా కుక్కలకు ట్రైనింగ్‌!

పోలీసులు తనిఖీలకు వస్తే వారు ఖాకీ డ్రస్సుతో ఉంటే కరిచేలా కుక్కలకు శిక్షణ ఇచ్చాడు. దీంతో డ్రగ్‌ డీలర్‌ ఇంట్లో తనిఖీలకు కొచ్చిన ఖాకీలపై కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి.

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:48 PM GMT
వీడెవడండీ బాబూ.. ఖాకీలు కనిపిస్తే కరిచేలా కుక్కలకు ట్రైనింగ్‌!
X

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నేరగాళ్లు అనేక మాయోపాయాలు పన్నుతున్నారు. పోలీసులు తమ ఇళ్లల్లో, ప్రాంతంలో తనిఖీలకు వస్తే తప్పించుకోవడానికి స్థానిక ప్రజలకు తాయిలాల ఆశచూపి కవచాలుగా వాడుకునే వారినే ఇన్నాళ్లూ చూశాం. అయితే ఇప్పుడొక డ్రగ్‌ డీలర్‌ వీరిని మించిపోయాడు. పోలీసులు తనిఖీలకు వస్తే వారు ఖాకీ డ్రస్సుతో ఉంటే కరిచేలా కుక్కలకు శిక్షణ ఇచ్చాడు. దీంతో డ్రగ్‌ డీలర్‌ ఇంట్లో తనిఖీలకు కొచ్చిన ఖాకీలపై కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఖాకీ దుస్తులు ధరించిన వారిని గాయపరిచేలా వాటికి అతడు శిక్షణ ఇచ్చినట్లు తెలుసుకొని పోలీసులు బిత్తరపోయారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నాడనే సమాచారంతో కేరళలోని కొట్టాయంలో ఓ వ్యక్తి ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ పోలీసుల బృందంలో సమీప పోలీసు స్టేషన్‌ కు చెందిన పోలీసులు కూడా ఉన్నారు.

డ్రగ్‌ డీలర్‌ ఇంటికి తనిఖీల నిమిత్తం అతడి ఇంట్లోకి వెళ్లిన పోలీసులపైకి ఒక్క సారిగా భారీ సంఖ్యలో కుక్కలు దాడి చేయడానికి దూసుకెళ్లాయి. దీంతో పోలీసులు బిత్తరపోయారు. డ్రగ్‌ డీలర్‌ ఇంట్లో అన్ని కుక్కలు ఉంటాయని ఊహించలేదని పోలీసులు వెల్లడించారు. అవి అంతలా తమపై హింసాత్మకంగా ప్రవర్తిస్తాయని అనుకోలేదన్నారు. కుక్కల దాడితో డ్రగ్‌ డీలర్‌ ఇంట్లో తాము సరిగా తనిఖీలు నిర్వహించలేకపోయామని కొట్టాయం ఎస్పీ వివరించారు. పోలీసులు కుక్కల దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉండగానే నిందితులు పక్కా ప్రణాళికతో పరారయ్యారని చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ కుక్కల దాడిలో ఏ ఒక్క పోలీసు గాయపడలేదని తెలిపారు. కాగా ఈ తనిఖీల్లో నిందితులు పారిపోగా ఘటనా స్థలం నుంచి 17 కేజీల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు.

పోలీసులు తనిఖీ చేసిన సమయంలో అతడి వద్ద 13 శునకాలు ఉన్నాయని, వాటిని యజమానులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కొట్టాయం ఎస్పీ వెల్లడించారు. ఈ డ్రగ్‌ రాకెట్‌ వెనుక ఎవరెవరు ఉన్నారో గుర్తించనున్నామని చెప్పారు.

మరోవైపు పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడైన డ్రగ్‌ డీలర్‌ గురించి సంచలన విషయాలు తెలిశాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. నిందితుడు అద్దె ఇంట్లో జీవిస్తున్నాడు. అంతేకాకుండా అతడు కుక్కలకు శిక్షణ ఇచ్చే డాగ్‌ ట్రైనర్‌ కూడా అని వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడు ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా కుక్కలకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. డాగ్‌ ట్రైనర్‌ గా పనిచేయకముందు అతడు శునకాలను అదుపు చేయడం ఎలా..? వంటి విషయాలపై విశ్రాంత బీఎస్‌ఎఫ్‌ అధికారి వద్ద శిక్షణ సైతం తీసుకున్నాడని తేలింది.

అయితే ఈ క్రమంలో అతడు అత్యుత్సాహానికి పోయి బీఎస్‌ఎఫ్‌ అధికారిని ప్రశ్నలు అడిగాడు. ప్రత్యేకంగా ఖాకీ దుస్తులు ధరించిన వారిని గాయపరచడం ఎలా ఆయనను అడిగాడు. దీంతో బీఎస్‌ఎఫ్‌ అధికారి అతడిని తిట్టి పంపేశాడు.

ఇక ప్రస్తుతం అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లో డాగ్‌ ట్రైనర్‌గా అందరికీ పరిచయం అయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలో నివాసం ఉన్నవారంతా అతడింట్లో తమ కుక్కలను వదిలివెళ్లేవారు. వాటికి శిక్షణ ఇచ్చిన అతడు ఒక్కో కుక్కకు రోజుకు రూ.1000 చొప్పున వసూలు చేశాడు.