Begin typing your search above and press return to search.

ఈ ‘దేవేంద్రుడు’.. చక్రవ్యూహాన్ని ఛేదించే నయా అభిమన్యుడు!

పైన చెప్పిన ఉదాహరణలన్నీ మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కచ్చితంగా వర్తిస్తాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2024 5:30 PM GMT
ఈ ‘దేవేంద్రుడు’.. చక్రవ్యూహాన్ని ఛేదించే నయా అభిమన్యుడు!
X

మనల్ని దెబ్బకొట్టిన వారిని బలహీన పర్చాలంటే ఎలా..? దీనికి సమాధానం ‘వారిని నిలువునా చీల్చడమే’ మనల్ని ఎగతాలి చేసినవారిని దెబ్బకొట్టడం ఎలా..? వారిపై ఘన విజయం సాధించడమే...ఓటమి ఎదురైతే.. ఏం చేయాలి..? అస్త్ర సన్యాసం చేయాలా ? కాదు.. తిరిగి విజయం సాధించేలా పోరాడాలి. పైన చెప్పిన ఉదాహరణలన్నీ మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కచ్చితంగా వర్తిస్తాయి.

ఓసారి ఐదేళ్లు సీఎంగా చేశాక.. మరోసారి చేపట్టిన సీఎం పదవి అనూహ్యంగా చేజారాక.. ఇంకోసారి ఉప ముఖ్యమంత్రిగా సరిపెట్టుకోవాల్సి వస్తే..? రాజకీయాల్లో ఇది కాస్త ఇబ్బందికర పరిణామమే. కానీ, అన్నిటినీ తట్టుకుంటేనే ఉన్నత స్థానానికి వెళ్లగలం. ఇప్పుడు ఫడ్నవీస్ ను చూస్తే ఇది నిజమని ఒప్పుకోక తప్పదు.

సముద్రం మళ్లీ గర్జించింది

‘నేను సముద్రం లాంటివాడిని.. తిరిగొస్తాను’ ఇది ఫడ్నవీస్ తరచూ చెప్పే మాట. 2019 ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్నా బీజేపీకి అధికారం దూరమైంది. నాడు శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే పొత్తు ధర్మం వీడి కాంగ్రెస్-ఎన్సీపీతో చేతులు కలిపారు. దీంతో మూడు రోజుల్లోపే ఫడ్నవీస్ సీఎం పదవి నుంచి వైదొలగారు. ఆ తర్వాత దాదాపు మూడేళ్లు ఆయన హ్యుమిలియేషన్ అనుభవించారు.

అఘాడీని చీల్చి

మహారాష్ట్రలో 2019 నుంచి 2022 వరకు మహా వికాస్‌ అఘాడీ సర్కారు కొనసాగింది. ఆ సమయంలో ఫడ్నవీస్ తన వ్యూహాలకు పదును పెట్టారు. శివసేనలో అసమ్మతిని పసిగట్టి ఏక్ నాథ్ శిందే ద్వారా ఆ పార్టీని చీల్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. తర్వాత మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. అప్పుడే ఆయనను ఉద్ధవ్‌ వర్గం వెక్కిరించేది. రాజకీయ చక్ర వ్యూహంలో ఫడణవీస్‌ చిక్కుకున్నారని ఎగతాళి చేసేంది.

‘‘ఒంటరి ఫడ్నవీస్ ఏం చేయగలడు’’ ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే విమర్శించారు. ఈలోగా లోక్‌ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ-శివసేన మహాయుతి కూటమికి గట్టి దెబ్బపడింది. చాలా తక్కువ సీట్లు రావడంతో ఆయన రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు. హై కమాండ్ వద్దనడంతో ఆగిపోయారు. గ్రౌండ్ లెవల్ లో బీజేపీ పటిష్ఠానికి ప్రయత్నాలు సాగించారు.

‘‘నేను నయా అభిమన్యుడిని.. చక్రవ్యూహాన్ని ఛేదించడం, విజయం సాధించడం నాకు తెలుసు’’ అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్ తనదైన ముద్ర వేశారు. అటు రూరల్, ఇటు అర్బన్ ప్రజల మద్దతును కూడగట్టారు. దీంతో 85శాతం స్ట్రయిక్ రేట్ తో 132 స్థానాల్లో బీజేపీని గెలిపించారు.

- చాలా నేర్పుగా 2022లో శివసేన, 2023లో ఎన్సీపీలను చీల్చడంలో ఫడ్నవీస్ దే ప్రధాన పాత్ర. తద్వారా ఆ రెండు పార్టీలు బలహీన పడ్డాయి.

- ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ లు ఇద్దరూ అభిమానించే అతికొద్ది మంది బీజేపీ నాయకుల్లో ఫడణవీస్‌ ఒకరు. ‘దేశానికి నాగపూర్ ఇచ్చిన బహుమతి ఫడ్నవీస్ ’ అంటారు మోదీ.

- ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ ఫడణవీస్ సొంత ఊరు. దీంతో సహజంగానే ఆయనకు సంఘ్ తో అనుబంధం ఏర్పడింది.

- 19 ఏళ్ల వయసులోనే 1989లో బీజేపీ స్టూడెంట్ వింగ్ ఏబీవీపీలో చేరారు. లా డిగ్రీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు. 22వ ఏటనే నాగపూర్‌ కార్పొరేటర్‌ అయ్యారు. 1997లో 27 ఏళ్ల వయసుకే మేయర్‌ పదవి చేపట్టారు.

-1999లో అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పుర్‌ నైరుతి నియోజకవర్గం నుంచి గెలిచారు.

-మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతమైన విదర్భ నుంచి ప్రభావ వంతమైన నాయకుడు ఫడ్నవీస్. 4 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.

-2014లో తన 44వ ఏట అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాష్ట్రంలో శరద్‌ పవార్‌ తర్వాత అతి పిన్న వయసులో సీఎం అయిన నాయకుడు ఈయనే.

- అభివృద్ధిని ఇష్టపడడం, అవినీతికి దూరంగా ఉండడం ఫడ్నవీస్ ను మచ్చలేని నాయకుడిగా నిలిపింది. మరోసారి సీఎం పదవి దక్కేలా చేసింది.