Begin typing your search above and press return to search.

కొత్త రచ్చ... (డిప్యూటీ) సీఎం నివాసంలో దున్నపోతులను బలిచ్చారు!

దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై.. షిండే, ఫడ్నవీస్ స్పందించారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 12:23 PM GMT
కొత్త రచ్చ... (డిప్యూటీ) సీఎం నివాసంలో దున్నపోతులను బలిచ్చారు!
X

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రచ్చ ప్రారంభమైంది. ఇందులో భాగంగా... మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం "వర్ష"లో క్షుద్రపూజలు జరిగాయని, అక్కడ దున్నపోతులను బలిచ్చారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై.. షిండే, ఫడ్నవీస్ స్పందించారు.

అవును... మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం "వర్ష"లో క్షుద్రపుజలు జరిగాయని.. అక్కడ దున్నపోతులను బలిచ్చి, వాటి కొమ్ములను అక్కడే పాతిపెట్టించరని.. సీఎం సీటు తనకే దక్కాలని, మరొకరు ఆ సీటులో ఎక్కువకాలం కొనసాగొద్దనే ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఈ పని చేశారని రౌత్ ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.

ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ క్షుద్రపూజల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తన కుమార్తె పదో తరగతి చదువుతోందని.. త్వరలో పరీక్షలు ఉండటంతో అధికారిక బంగ్లాలోకి ఇంకా మారలేదని.. కుమార్తె పరీక్షలు అయిన తర్వాత "వర్ష"లోకి షిఫ్ట్ అవుతామని తెలిపారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి అధికారిక నివాసం "వర్ష"లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఉంటున్నారు. ఈ సందర్భంగా క్షుద్రపూజల ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ క్షుద్ర పూజలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నవారికి ఇలాంటి వ్యవహారాల్లో బాగా అనుభవం ఉండి ఉండోచ్చని కామెంట్ చేశారు.

కాగా... గత ఏడాది డిసెంబర్ 5న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం "సాగర్" బంగ్లాలోనే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.