Begin typing your search above and press return to search.

కొలువుదీరిన 'మహా' ప్రభుత్వం... బీజేపీ మిత్రధర్మం ఇదే!

ఈ "మహాయుతి" కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 4:05 PM GMT
కొలువుదీరిన మహా ప్రభుత్వం... బీజేపీ మిత్రధర్మం ఇదే!
X

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ "మహాయుతి" కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ బీజేపీ అధిష్టానం శివసేన అధినేత ఏక్ నాథ్ శిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ లకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది.

అవును... మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ శిండే, అజిత్ పవార్ లు ప్రమాణస్వీకారం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

వాస్తవానికి నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం ఎవరనే విషయంపై తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ శిండే అని ఒకరు అంటే.. ఫడ్నవీస్ అని మరొకరు అన్నారు. తాను కూడా పోటీలో ఉన్నానంటూ అజిత్ పవార్ స్పందించిన పరిస్థితి! ఈ నేపథ్యంలో బీజెపీ కోర్ కమిటీ.. ఫడ్నవీస్ పేరును ఖరారు చేసింది.

ఈ నేపథ్యంలోనే మిత్రధర్మాన్ని పాటిస్తూ ఏక్ నాథ్ శిండే, అజిత్ పవార్ లకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి అజిత్ పవార్ బాధ్యతలపై బుధవారమే ఓ స్పష్టత వచ్చినప్పటికీ.. శిండే మాత్రం ఈ పదవికి అంగీకరిస్తారా లేదా అనే సందిగ్దతకు బుధవారం సాయంత్రం క్లారిటీ వచ్చింది. దీనిపై శివసేన అధికారిక ప్రకటనతో ఉత్కంటకు తెరపడింది.

కాగా.. గత నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బీజేపీ 132 స్థానాలు గెలుచుకోగా.. శివసేన (శిండే) - 57, ఎన్సీపీ (ఏపీ) - 41 స్థానాల్లో విజయం సాధించింది.

ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 51 స్థానాలతో సరిపెట్టుకున్న పరిస్థితి! ఇందులో భాగంగా... కాంగ్రెస్ 16, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాల్లో గెలుపొందాయి.