Begin typing your search above and press return to search.

ఈ యువ నేతకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి!

మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో బీజేపీకి గట్టి నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉన్నారు. ముఖ్యంగా నాగపూర్‌ ప్రాంతంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 1:30 PM GMT
ఈ యువ నేతకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి!
X

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి మహారాష్ట్ర బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎంపికవుతారని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో బీజేపీకి గట్టి నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉన్నారు. ముఖ్యంగా నాగపూర్‌ ప్రాంతంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.

కాగా ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన పదవీకాలం జూన్‌ లోనే ముగిసింది. అంతేకాకుండా నడ్డా ఇప్పటికే రెండు పర్యాయాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలకు కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీలో యువ నేతగా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని దేవేంద్ర ఫడ్నవీస్‌ పై బీజేపీ పెద్దలు దృష్టి సారించారని తెలుస్తోంది. అందులోనూ ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ కు అత్యంత ఇష్టుడని సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్‌ కు చెందిన నేతే దేవేంద్ర ఫడ్నవీస్‌ కావడం గమనార్హం.

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్‌ సమావేశానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ మనసులో మాటను ఫడ్నవీస్‌ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఫడ్నవీస్‌ కుటుంబం ఫొటో కూడా దిగింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇక ఆయన ఢిల్లీకి వెళ్తారని చెబుతున్నారు.

కాగా 2014 అక్టోబర్‌ నుంచి 2019 నవంబర్‌ వరకు ఐదేళ్లు దేవేంద్ర ఫడ్నవీస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, శివసేనకు కూటమికి మెజార్టీ సీట్లు రావడంతో ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే శివసేన తమకు ముఖ్యమంత్రి పీఠం కావాలని కూటమి నుంచి వైదొలిగింది. దీంతో మెజార్టీ లేక ఫడ్నవీస్‌ కొద్ది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలో రెండేళ్లపాటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే.. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శివసేనను చీల్చి ఏకనాథ్‌ షిండే, ఎన్సీపీని చీల్చి అజిత్‌ పవార్‌.. బీజేపీకి మద్దతు ఇచ్చారు. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా శివసేన చీలికవర్గం నేత ఏకనాథ్‌ షిండేకు ముఖ్యమంత్రి పదవిని వదిలేసింది. అజిత్‌ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.

ఫడ్నవీస్‌ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంచుకోవడం వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపిక బీజేపీకి మేలు చేస్తుందనే ఆశాభావంతో ఆ పార్టీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది.