ఉగ్రవాది కసబ్ ను చంపాలనుకున్న ఆమె ఏం చెప్పారంటే?
సరిగ్గా పదహారేళ్ల క్రితం ఇదే రోజున యావత్ దేశం ఉలిక్కిపడిన ఉదంతం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 26 Nov 2024 4:43 AM GMTసరిగ్గా పదహారేళ్ల క్రితం ఇదే రోజున యావత్ దేశం ఉలిక్కిపడిన ఉదంతం చోటు చేసుకుంది. అరేబియా సముద్ర మార్గాన గుట్టుచప్పుడు కాకుండా దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలోకి అడుగు పెట్టి.. కనిపించిన వారిని కనిపించినట్లుగా పిట్టల మాదిరి కాల్చేయటమే కాదు.. ముంబయి రైల్వే స్టేషన్.. తాజ్ హోటల్ తో పాటు మరిన్ని ప్రాంతాల్లో టెర్రర్ క్రియేట్ చేసిన ఈ ఉగ్ర ఘటనలోనే అమాయక ప్రజల్ని, విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని ఉగ్రవాదులు చంపేశారు. ఈ ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి వేళ అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే.. ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్.. ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే.. సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ విజయ్ సలాస్కర్ లు అమరులు కావటం తెలిసిందే. ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో సజీవంగా చిక్కినోడు కసబ్. అతడ్ని చట్టప్రకారం సుదీర్ఘంగా విచారించి ఉరిశిక్ష వేయటం.. అమలు చేయటం తెలిసిందే.
పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన ఈ మారణహోమానికి ఎందరో అమాయకులు బలయ్యారు. పలువురు గాయపడ్డారు. ఆ రోజు జరిగిన ఘటనకు.. ఉగ్రవాదులు జరిపిన దాడికి గాయపడ్డారు దేవిక రోటావన్. ఉగ్రదాడి జరిగిన రోజున ఆమెకు తొమ్మిదేళ్లు. తన తండ్రితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లిన వేళ.. ఉగ్రవాది కసబ్ ను గుర్తించటంతో పాటు... అతడు జరిపిన కాల్పుల్లో కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడింది. ముంబయి మారణహోమానికి పదహారేళ్లు గడిచిన వేళ.. పీటీఐ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పుడేం జరిగింది? తానేం అనుకున్న విషయాల్ని చెప్పటంతో పాటు.. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్న వివరాల్ని వెల్లడించారు.
ఉగ్రదాడి జరిగిన రోజున తాను.. తన తండ్రి.. అన్నయ్య కలిసి ఫుణెలో ఉన్న పెద్దన్నయ్యను కలిసేందుకు బయలుదేరినట్లు చెప్పారు. బాంద్రా నుంచి సీసీఎంటీకి చేరుకున్న వేళలో ఒక బాంబు పేలుడు సంబవించటం.. గన్ కాల్పులు మొదలయ్యాయని.. ఆ దాడిలో తనతో పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. గాయపడిన తర్వాత తొలుత తమను సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారని.. తర్వాత తనను జేజే హాస్పిటల్లో చేర్చినట్లు చెప్పారు. అప్పటికే తాను అపస్మారక స్థితికి చేరుకున్నానని.. తన కాలిలో దిగిన బుల్లెట్ ను తొలగించారని చెప్పారు.
‘‘ఆ గాయం నుంచి కోలుకోవటానికి దాదాపు నెల రోజులు పట్టింది. ఇప్పటికి ఆ గాయం కారణంగా కాలు నొప్పి పెడుతోంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి తర్వాత మా స్వస్థలమైన రాజస్థాన్ కు వెళ్లిపోయాం. కొన్నాళ్లకు పోలీసులు మా వద్దకు వచ్చారు. నేను.. మా నాన్న.. ఉగ్రవాదుల్ని చూశాం. దీంతో సాక్ష్యం చెప్పేందుకు ఒప్పుకున్నాం. అజ్మల్ కసబ్ ను నేను గుర్తించా. అతడి వల్ల మేమెంతో బాధపడ్డాం. అతడ్ని చంపాలనుకున్నా. కానీ.. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. కోర్టులో అతడ్ని గుర్తించటం తప్పించి ఇంకేం చేయలేకపోయా’’ అని పేర్కొన్నారు.
ఉగ్రదాడి వేళ తొమ్మిదేళ్ల దేవిక ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బాంద్రా ఈస్ట్ లో అద్దెకు ఉంటున్నారు. ముంబయి దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారి మాదిరే తనకు రూ.3.26 లక్షల పరిహారం అందినట్లుగా చెప్పిన ఆమె.. తన వైద్య ఖర్చుల కోసం దేవేంద్ర ఫడ్నవీస్ రూ.10 లక్షలు సాయం చేశారన్నారు. తన కుటుంబానికి ప్రభుత్వం ఒక ఇల్లు కేటాయించిందని.. దాని అప్పగింత కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఉగ్ర ఘటన జరిగిన పదహారేళ్లకు బాధితులకు ఇవ్వాల్సిన ఇంటిని ఇంకా కేటాయించకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఉగ్రదాడుల కారణంగా బాధితులుగా మారిన వారి విషయంలో అయినా ప్రభుత్వాలు సానుభూతితో వ్యవహరించాలి కదా? అలా కూడా ఎందుకు చేయట్లేదు?