జగన్ 2.0లో ఆయనకు మంత్రి పదవి ఖాయమట.. !
వాస్తవానికి కమ్మ సామాజిక వర్గంలో వైసీపీకి చెందిన నాయకులను చూస్తే.. దేవినేని అవినాష్ జగన్‌కు బాగా దగ్గరగానే ఉన్నారు.
By: Tupaki Desk | 21 Feb 2025 7:30 AM GMTవైసీపీ అధినేత జగన్.. తమ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని.. జగన్ 2.0 వస్తుందని ప్రకటన చేసిన దరి మిలా.. వైసీపీలో కొంత ఉత్సాహం పుంజుకుంది. పార్టీ అధికారంలోకి వస్తే.. తమకు ఖాయంగా పదవులు దక్కుతాయని కొందరు నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో విజయవాడ కు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్ చౌదరి ముందున్నారు. ఈయన అనుచరులు అయితే.. సోషల్ మీడియాలో కాబోయే మంత్రి అని వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాస్తవానికి కమ్మ సామాజిక వర్గంలో వైసీపీకి చెందిన నాయకులను చూస్తే.. దేవినేని అవినాష్ జగన్‌కు బాగా దగ్గరగానే ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా.. దేవినేనికి ప్రాధాన్యం దక్కింది. యువ నాయకుడిగానే కాకుండా.. సామాజిక వర్గం పరంగా కూడా.. అవినాష్‌ను జగన్ చేరువ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న అవినాష్‌కు.. పార్టీలోనూ పదవి అప్పగించారు. అంతేకాదు.. తను ఎక్కడికి వెళ్లినా.. ఆయనకు ఆహ్వానం పంపించారు.
తాజాగా విజయవాడ జైల్లో ఉన్న వంశీని పరామర్శించినప్పుడు కూడా అవినాష్‌ను పక్కనే పెట్టుకున్న జగన్.. రేపో మాపో.. అవినాష్‌పై కుట్రలు జరిగే అవకాశం ఉందన్నారు. అయినా.. మేమేమీ భయపడడం లేదన్నారు. దీనిని బట్టి కమ్మ సామాజిక వర్గంలో కొడాలి నాని, వంశీలతో పాటు యువ నాయకుడిగా.. దేవినేని అవినాష్‌కు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం తెలిసింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంటే.. ఖచ్చితంగా అవినాష్‌ను మంత్రిని చేస్తారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
తండ్రిచాటు లేదు!
సాధారణంగా.. వారసత్వ రాజకీయాలతో వచ్చిన వారు.. ఇప్పటికీ తండ్రిపేరు , కుటుంబం పేరు చెప్పుకొం టున్నారు. కానీ, అవినాష్ కూడా తన తండ్రి దేవినేని నెహ్రూ వారసుడిగానే రాజకీయాల్లోకి వచ్చిన.. గత పదేళ్లుగా తనంటూ..ఏమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణలంక వాసులకు 30 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు. గుణదలకొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇప్పించారు. పటమటలో ట్రాఫిక్ నియంత్రణ, ఆటోనగర్ కార్మికులకు ప్రత్యేక భవనం, రహదారుల నిర్మాణం వంటివి చేయించారు. ఇలా.. అవినాష్ వ్యక్తిగతంగా కూడా పేరు తెచ్చుకుంటున్న దరిమిలా.. ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు దేవినేని అనుచరులు.